రఘునాథపాలెం, ఫిబ్రవరి 19 : బంజారాల ఆరాధ్యదైవం ‘సంత్ సేవాలాల్ మహరాజ్’ దైవాంశ సంభూతుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అమ్మవారి కృపతోనే సేవాలాల్ మహరాజ్ జననం జరిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఖమ్మం నగరం 4వ డివిజన్ పాండురంగాపురంలో జరిగిన సేవాలాల్ మహరాజ్ 284 జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. బంజారా మహిళలు గిరిజన సాంప్రదాయ దుస్తులు, వేషధారణతో ఆయనకు స్వాగతం పలికారు.
ముందుగా కాలనీలోని ఆలయంలో కొలువుదీరిన సేవాలాల్ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులు తమ ఆరాద్యదైవంగా భావించే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పండుగ వాతావరణంలో గిరిజనులంతా కలిసి ఒక వేదికగా సేవాలాల్ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సేవాలాల్‌ను స్ఫూర్తిగా తీసుకొని బంజారాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
గిరిజన తండాలు అంటే నిత్యం ఒకప్పుడు కొట్లాటలు, ఘర్షణలకు నిలయాలుగా ఉండేవని, ఇకపై తండాల ప్రజలంతా శాంతి పూరిత వాతావరణంలో తమ జీవితాలను గడపాలని మంత్రి అభిలషించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, బీఆర్ఎస్ 2వ డివిజన్ అధ్యక్షుడు నర్రా యల్లయ్య, సేవాలాల్ సేన బాధ్యులు మూడ్ బాల్సింగ్, చక్రవర్తి, హతీరాం, మంగీలాల్, మంగ్య, జైపాల్, భాగ్యారావు పాల్గొన్నారు.
కోటపాడులో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటపాడు ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగా, శివ, పార్వతుల పల్లకి సేవలో స్వయంగా పల్లకి మోసి గ్రామోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఆలయాన్ని పునఃనిర్మించుకొని తొలి మహాశివరాత్రి పండుగను జాతరలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో దైవత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ బాతుల రమణసుధాకర్, మాజీ సర్పంచ్ నెల్లూరి చంద్రయ్య, బాతుల సుధాకర్, రామా వెంకటేశ్వర్లు, కొంటెముక్కల నాగేశ్వరరావు, కొంటెముక్కల ఉపేందర్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మందడపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.