ఖమ్మం, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడంతోపాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేసిన సందర్భంగా మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు చరిత్ర మర్చిపోలేని రోజని, ఆర్టీసీలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎవరు ఊహించని విధంగా పక్షంరోజుల్లోనే విలీనం చేసినందుకు ఆర్టీసీ ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీసీని బతికించాలంటే విలీనం తప్ప మరో మార్గంలేదని భావించిన కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారని, వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.