ఖమ్మం, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):వరద సహాయక చర్యలపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులంతా ప్రభుత్వ చర్యలను, సహకారాన్ని అభినందిస్తుండడాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నేతలు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి వరద పరిస్థితిని పరిశీలించేందుకు శనివారం భద్రాచలం వచ్చిన ఆయన.. ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు బాసటగా, ప్రభుత్వానికి చేయూతగా ఉండాల్సిన ప్రతిపక్షాలు.. బురద రాజకీయాలు చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
వారం రోజులుగా గోదావరి వరదలు పోటెత్తుతుండడంతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని, మంత్రులను, అధికారులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల కారణంగానే ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని గుర్తుచేశారు. ఈ విషయాన్ని విస్మరించిన కాంగ్రెస్ నేతలు.. రాజకీయ కోణంలోనే విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పాలనలో గోదావరిని వరదలు ముంచెత్తిన తరుణంలో అప్పటి పాలకుల వైఫల్యం కారణంగా మృతదేహాలు కుప్పలుతెప్పలుగా కొట్టుకొచ్చిన ఘటనలను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. సీఎల్పీ నేత భట్టి భద్రాచలం, ఖమ్మంలలో పర్యటించి ప్రజలతో మాట్లాడినప్పుడు వారంతా ప్రభుత్వ చర్యలను అభినందించారే తప్ప విమర్శించలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు ఇవే ఉదాహరణలని స్పష్టం చేశారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం..
భద్రాచలం వద్ద గోదావరి వరద 58 అడుగుల వరకు పెరిగినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఇంకా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వమూ, యంత్రాంగమూ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల వరద ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించినట్లు చెప్పారు. గోదావరి మరింత పెరిగినా, పరీవాహకంలో ఏ అత్యవసరం వచ్చినా వెంటనే స్పందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైమానిక దళ హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోనే ఉన్నట్లు చెప్పారు. ఆదివారం నాటికి గోదావరి వరద కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు.