మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నగరంలోని మమత ఆసుపత్రి గ్రౌండ్లో మంగళవారం జరిగింది. ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మంత్రి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉందని, నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం జిల్లాపై బలమైన నమ్మకం ఏర్పడిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందిద్దామని పిలుపునిచ్చారు. మంత్రిగా ఈ నాలుగేళ్లలో రూ.1,200 కోట్లతో ఖమ్మంలో సమగ్రాభివృద్ధి సాధించానన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తనపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధైర్యముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలుగు రాష్ర్టాల్లో చరిత్రను తిరగరాస్తూ.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడంలో ఖమ్మం జిల్లా ప్రధాన భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నగరంలోని మమత ఆసుపత్రి గ్రౌండ్లో మంగళవారం జరిగింది. ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మంత్రి అజయ్ ఎగురవేశారు. అనంతరం పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో మంత్రి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు ఎవరూ లేరని, ఒకే పార్టీకి ప్రజలు ఎప్పుడూ పట్టం కట్టిన సందర్భం లేదని గుర్తుచేశారు. ఆ చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ తిరగరాయబోతున్నారని స్పష్టం చేశారు. అందుకు మనమంతా కంకణబద్ధులమై పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉందని, నేడు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం జిల్లాపై బలమైన నమ్మకం ఏర్పడిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. మంత్రిగా ఈ నాలుగేళ్లలో రూ.1200 కోట్లతో ఖమ్మంలో సమగ్రాభివృద్ధి సాధించానన్నారు.
ధైర్యముంటే నాపై పోటీ చెయ్..
సభ్యత, సంస్కారం లేకుండా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తనపై అవాకులు, చవాకులు పేలుతున్నారని మంత్రి అజయ్ విమర్శించారు. ధైర్యముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో వచ్చే సీజనల్ పక్షి రేణుకాచౌదరి అనే విషయం జిల్లా ప్రజలకు తెలుసుని ఎద్దేవా చేశారు. గిరిజనులకు టికెట్లు ఇస్తామని రూ.కోట్లు దండుకొని వారి ప్రాణాలను బలిగొన్న చరిత్ర రేణుకాచౌదరిదని ద్యుయబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ని, మంత్రి కేటీఆర్‌ను, తనను తిడితేనే రాజకీయ పబ్బం గడుపుకోవచ్చుననే ఆలోచనలో జాతీయ పార్టీల నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు. కానీ జిల్లా ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని హితవు పలికారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి ఖమ్మం వచ్చి షో చేస్తే ప్రజలెవరూ నమ్మరని అన్నారు.
Khammam6
పలు తీర్మానాలు ఆమోదం..
ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సమ్మేళనంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను మంత్రి అజయ్‌కుమార్‌తోపాటు హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు అమోదించారు. దళితుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలపై దళిత సంఘం నేత లింగాల రవికుమార్, మహిళా సాధికారిత కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై బీఆర్ఎస్ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మైనారిటీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలపై బీఆర్ఎస్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, బీసీల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలపై పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మేకల సుగుణారావులు తీర్మానాలు ప్రవేశపెట్టగా.. మంత్రి అజయ్ సహా బీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టి ఆమోదించారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, గుత్తా రవి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కమర్తపు మురళి, అశ్రఫ్, జహీర్ అలీ, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, లక్ష్మణ్‌నాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, నున్నా శ్రీనివాసరావు, పులిపాటి ప్రసాద్, చెరుకూరి కృష్ణమూర్తి, కొప్పు నరేశ్, చిన్ని కృష్ణారావు, కుర్రా భాస్కర్‌రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రూ.50 వేల కోట్లతో ఖమ్మం జిల్లా అభివృద్ధి..
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. విజన్ ఉన్న మహానేత కేసీఆర్ ఎంతో ముందుచూపుతో పథకాలకు శ్రీకారం చుట్టి అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపించారని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే టూరిస్టులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 30న ప్రారంభించుకునే తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం కేసీఆర్ దార్శనిక పాలనకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ కావాలంటూ మహారాష్ట్ర ప్రజలు కోరుతున్నారని గుర్తుచేశారు. అందుకే ఔరంగాబాద్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారని అన్నారు.
కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..
-తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
ప్రజల కోసం పని చేసే వారు ఎవ్వరైనా చరిత్రలో నిలిచిపో తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా అటువంటి వారేనని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి.. దానిని సాధించి యుగ పురుషుడయ్యారని గుర్తుచేశారు. ఖమ్మం ప్రగతి బీఆర్ఎస్తోనే ముడిపడి ఉందని అన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిలా మంత్రి అజయ్‌కుమార్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సత్తా చూపాలని కోరారు.
జెట్ స్పీడ్‌తో తెలంగాణ అభివృద్ధి..
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో 95 శాతం నిధులు ఆంధ్రా ప్రాంతానికే కేటాయించే వారని గుర్తుచేశారు. కానీ నేడు సీఎం కేసీఆర్ కేవలం తెలంగాణకే రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. ఎన్నికల సమయంలో కనిపించే వలస పక్షుల మాటలను జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం ఉందని, వారి ఆటలు ఇక్కడ సాగవని స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డిల్లీ స్థాయిలో ప్రధాన భూమిక పోషించనున్నారని స్పష్టం చేశారు.