పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించింది. ఊరూవాడా ఏకమైంది.. జన సందడితో చెరువమ్మ పులకించింది. చెరువులోని అలల సవ్వడితో సబ్బండవర్గాలు మురిసిపోయాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాట నృత్యాలతో మైమరిచిపోయాయి. ఆడపడుచులు, యువకుల కేరింతలతో పొలిమేరల్లో పొలికేక వినిపించింది. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు చెరువు పండుగలో భాగస్వాములయ్యారు. చెరువుల వద్దే సామూహిక భోజనాలు చేసి ఐక్యతను చాటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ‘చెరువుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో బతుకమ్మలు ఆడి కోలాటం వేస్తూ సందడి చేశారు.
Khammam2
ఖమ్మం, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువుల వద్ద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ‘చెరువుల పండుగ’ నిర్వహించారు. వైరా పట్టణంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్, కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన జనంతో ఆడిపాడి సందడి చేశారు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి అజయ్, మేయర్ నీరజ, సుడా చైర్మన్, తదితరులు హాజరయ్యారు. రంగవల్లులు, ట్యాంక్‌బండ్‌పై లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్తుపల్లి పట్టణంలోని వేశ్యకాంతల చెరువు, కల్లూరు, తల్లాడ మండలాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
ఆత్కూరు చెరువు వద్ద ఉత్సవంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో నిర్వహించిన చెరువుల పండుగలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి వేడుకలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, దమ్మపేట మండలంలోని గణేశ్పాడు చెరువుల పండుగలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో నిర్వహించిన చెరువుల పండుగలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.