సత్తుపల్లిటౌన్, ఆగస్టు 8 : సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను వేగవంతం చేశామని, అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్స్‌ను పరిశీలించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 9 మండలాల్లో గల 1.75 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు రూ.93 కోట్లు ఖర్చు చేసి 9.6 కి.మీ. మేర ఏన్కూరు వద్ద లింక్ కెనాల్ ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధప్రాతిపదికన కెనాల్ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
అన్నీ సహకరిస్తే ఈ నెల 15న సీఎం చేతులమీదుగా ఏన్కూరు వద్ద లింక్ కెనాల్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31 వేల కోట్ల రుణమాఫీని రైతులకు చెల్లిస్తోందన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్లరేషన్ కార్డులతోపాటు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు ఈ నెలాఖరుకల్లా ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేందుకు ధరణి చట్టాన్ని సవరించబోతున్నామని తెలిపారు.
ప్రజల అభిప్రాయంతో రెవెన్యూ చట్టాన్ని మారుస్తామన్నారు. గతంలో 2 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారని, రాబోయే మూడు నెలల్లోపు ఖాయమైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అప్రూవల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉండగా.. రాష్ట్రం పేరును కూడా బడ్జెట్లో ఉచ్ఛరించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆంధ్రా రాష్ర్టానికి ఇచ్చిన నిధుల్లో సగమైనా తెలంగాణ రాష్ర్టానికి కేటాయించి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉడతనేని అప్పారావు పాల్గొన్నారు.