బూర్గంపహాడ్, అక్టోబర్ 15 : గ్రామీణ ప్రజలకు పంచాయతీలతోనే మెరుగైన పాలన అందుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాళ్లగొమ్మూరు పంచాయతీలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన పంచాయతీ భవనం, ఐటీసీ నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతోపాటు సకల సౌకర్యాలు అందుతున్నాయని అన్నారు. తొలుత మోరంపల్లిబంజరకు చేరుకున్న మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మణుగూరు క్రాస్ రోడ్ వద్ద కూడా ఆయనకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీఎస్పీ సతీశ్‌కుమార్, సీఐ వినయ్‌కుమార్, ఎస్సైలు రాజేష్, కిన్నెర రాజశేఖర్, తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో సునీల్ శర్మ, ఐసీడీఎస్ సీడీపీవో రేవతి, పీఆర్ డీఈ పొదెం వెంకటేశ్వర్లు, ఐటీసీ హెచ్ఆర్ హెడ్ శ్యామ్‌కిరణ్, అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, ఈవో మహేశ్, పంచాయతీ కార్యదర్శి తలగాని మురళి పాల్గొన్నారు.