లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 9 : అడవుల్లో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచడానికి పూనుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ముగింపు సందర్భంగా కొత్తగూడెం గణేశ్ టెంపుల్ నుంచి రేగళ్ల క్రాస్‌రోడ్ వరకు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ చేశారు.
అనంతరం చాతకొండ బీట్ కొత్తగూడెం రేంజ్, డివిజన్ పరిధిలో 50 ఎకరాల్లో అటవీ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. అడవులు నరికివేతకు గురికాకుండా అటవీ అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. భూ సమస్యల విషయంలో అటవీ అధికారులకు రెవెన్యూ శాఖ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
కొత్తగా పోడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖలో అమరుడైన ఎఫ్ఆర్వో సీహెచ్.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు 500 గజాల స్థలానికి సంబంధించిన పట్టాను వారం రోజుల్లో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీసీఎఫ్ భీమానాయక్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎఫ్‌డీవో కోటేశ్వరరావు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.