కూసుమంచి, జూన్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించిన ప్రజల కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలోని 20 గ్రామాల్లో శనివారం సుడిగాలి పర్యటన చేసిన ఆయన నాయకన్‌గూడెంలో జరిగిన సభలో మాట్లాడారు.
వారం రోజుల్లో జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని అన్నారు. అధికారులు గ్రామాల్లో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవన్నారు. వచ్చే ఐదేళ్లలో అర్హులందరికీ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, నా సొంత నియోజకవర్గం పాలేరులో మూడేళ్లలోనే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశాల్లో వచ్చిన దరఖాస్తుల విషయంలో అధికారులు వెంటనే స్పందించాలని, సమావేశాల్లో చెప్పే మాటలే ఆదేశాలుగా పని చేయాలని, లేదంటే తర్వాత ఇబ్బంది పడతారన్నారు.
గత ఎన్నికల్లో గ్రామాల్లో పర్యటనల సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు వచ్చే మూడేళ్లలో కార్యాచరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, జూకూరి గోపాల్‌రావు, సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, హపీజుద్దీన్, భద్రయ్య, ఉపేందర్, బారి వీరభద్రం, రూరల్ సీఐ రాజిరెడ్డి, ఎస్సై కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.