కూసుమంచి, జూలై 14: పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు మంజూనైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సి బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు సహా వివిధ సంఘాల బాధ్యులు, ఇతర ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. ఆర్డీవో గణేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు బెల్లం శ్రీను, బానోత్ శ్రీనివాస్, హేమలత, వెంకటేశ్వర్లు, పుష్పలత, సురేశ్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రితో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం సమావేశమయ్యారు. కూసుమంచికి మంజూరైన 100 బెడ్ల ఆసుపత్రి స్థలం, నర్సింగ్ కాలేజీ, జూనియర్ కాలేజీల స్థలాలు, పాలిటెక్నిక్ కళాశాల స్థల సేకరణ, ఇతర అంశాలపైనా చర్చించారు.