కూసుమంచి (నేలకొండపల్లి), అక్టోబర్ 16: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెలాఖరు వరకు నియోజకవర్గంలో అర్హులైన 4 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లిలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లను మంత్రి బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు వృత్తి కోసం వినియోగించే కిట్లు, ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేశామని, గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లు అందిస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు రూ.18 వేల కోట్లు మాఫీ జరిగిందని, ఇంకా రూ.13 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని, వాటిని కూడా చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చేర్పించాలని మంత్రి పొంగులేటి అన్నారు. మండలంలోని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో చదివే బాలికలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, నేలకొండపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ఆర్డీవో గణేశ్, ఎక్సైజ్ ఈసీ వేణుగోపాల్‌రెడ్డి, డీఈవో సోమశేఖర శర్మ, మార్కెట్ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మద్ది మల్లారెడ్డి, వజ్జా రమ్య, నెల్లూరి భద్రయ్య, దండా పుల్లయ్య, రాయపుడి నవీన్, బొడ్డు బొందయ్య, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.