ఇల్లెందు పట్టణం ఆదివారం జనంద్రాన్ని తలపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇల్లెందులో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ఇల్లెందు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇల్లెందు పట్టణం కిక్కిరిసింది. మహిళల బోనాలు, కళాకారుల డప్పులు, కోలాట నృత్యాలతో బొగ్గుట్ట కోలాహలంగా మారింది.
రహదారి పొడవున్నా మంత్రి కేటీఆర్‌పై ప్రజ లు పూల వర్షం కురిపించారు. ఇల్లెందు పట్టణంలోని మహబూబాబాద్ క్రాస్ రోడ్ నుంచి కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా జగదాంబ సెంటర్ వరకూ రోడ్ షో కొనసాగింది. కాగా, రోడ్ షోకు అశేషంగా వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కృతజ్ఞతలు తెలిపారు.