‘తెలంగాణలో ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటక నుంచి నోట్ల కట్టలు తెస్తున్నారు. ఎన్ని కోట్లు తెచ్చినా ఇక్కడి ప్రజల అభిమానాన్ని కొనలేరు. వారిచ్చే హామీలన్నీ అడ్డగోలువే. గ్యారెంటీ కార్డుల హామీలిస్తున్న కాంగ్రెస్ నేతల సీట్లకే గ్యారెంటీ లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన గొప్పనేత.. ముఖ్యమంత్రి కేసీఆర్. పని ఎత్తుకుంటే పట్టువదలని విక్రమార్కుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఖమ్మం ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అజయ్‌కుమార్ గెలుపు తథ్యం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం నగరంతోపాటు సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో శనివారం ఆయన పర్యటించి మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి ఖమ్మంలో రూ.1,360 కోట్లు, సత్తుపల్లిలో రూ.126 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిని ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలోనూ దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటామన్నారు. బడుగు బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో దీన్ని బట్టి తెలుస్తున్నదన్నారు. పర్యటనలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, కందాళ, మెచ్చా పాల్గొన్నారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ తక్షణం దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో ప్రతి దళిత కుంటుంబానికీ దళితబంధును వర్తింపజేస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటామని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో దీనిని బట్టి తెలుస్తోందని అన్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు ఇస్తున్నవన్నీ అడ్డగోలు హామీలేనని, ఎలాగూ గెలవలేమన్న భయంతోనే వారు ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఒక్కచాన్స్ అంటూ 11 పర్యాయాలు అవకాశమిచ్చినా ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
ఖమ్మం, సత్తుపల్లిలో శనివారం పర్యటించిన ఆయన.. మంత్రి అజయ్‌తో కలిసి ఆయా నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి నోట్ల కట్టలు తెస్తున్నారని విమర్శించారు. వారు ఎన్ని కోట్లు తెచ్చినా ఇక్కడి ప్రజల అభిమానాన్ని కొనలేరని స్పష్టం చేశారు. అవినీతి కుంభకోణాలు, సీల్డ్ కవర్ల విధానాలు ప్రజలకు బాగా తెలుసునని దుయ్యబట్టారు. గ్యారెంటీ కార్డుల హామీలిస్తున్న కాంగ్రెస్ నేతల సీట్లకే గ్యారెంటీ లేదని విమర్శించారు. తొమ్మిన్నరేళ్లలో తెలంగాణను తీర్చిదద్దిన గొప్ప నేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పని ఎత్తుకుంటే పట్టువదలని విక్రమార్కుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అని, ఖమ్మం ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అజయ్‌కుమార్ గెలుపు తథ్యం స్పష్టం చేశారు.
తొమ్మిదిన్నర ఏళ్ల నుంచి పరుగెడుతున్న ప్రగతి రథ చక్రాలు ముందుకు సాగాలంటే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ, అభివృద్ధి కోసం పరితపించే సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా ఉండడం సత్తుపల్లి ప్రజల అదృష్టమని అన్నారు. ఎమ్మెల్యే పదేళ్లలో సత్తుపల్లిలో రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ప్రజలను దగా చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల మోసాలు, అవినీతిని ప్రజలెవరూ మరచిపోలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పంటలు, ఇళ్లకు సక్రమంగా కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్, ప్రస్తుతం 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీరు, తాగునీటికి దిక్కులేదన్నారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం పూటల కొద్దీ లైన్లలో నిలబడి గోస పడ్డారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టం రాకుండా చూసుకుంటున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేని వారంటీ లేని కాంగ్రెస్.. ఇప్పుడు గ్యారెంటీ స్కీంలంటూవస్తున్నదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ తన గురువు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును మించిన శిష్యుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ పక్కన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగువాళ్లపై ప్రపంచ దృష్టి పడేలా చేసిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. అలాగే ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారన్నారు. గురువు ఎన్టీఆర్ చేయలేని పనిని శిష్యుడు సీఎం కేసీఆర్ చేశారన్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో సాధించారని, కానీ మూడోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారన్నారు. ఆ రికార్డును కేసీఆర్ సాధిస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు.
రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారడం గ్యారెంటీ అని సత్తుపల్లి సభలో మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆకాశం నుంచి పాతాళం దాకా అవినీతి కుంభకోణాలకు పాల్పడడం గ్యారెంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీకి ఢిల్లీలో హైకమాండ్ ఉందని, కొత్తగా బెంగళూరులో న్యూ కమాండ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరగడానికి సమయం ఉండదని, దీంతో ప్రజలను పట్టించుకోరని దుయ్యబట్టారు. ఎలాగూ తాము అధికారంలోకి రాలేమని తెలుసు కాబట్టే ఆ పార్టీ నాయకులు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, అలాగే మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలోనూ ప్రతి దళిత కుంటుంబానికీ దళితబంధు వర్తింపజేస్తామని అన్నారు. అందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పార్టీని వీడిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తున్నారని, ద్వేషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయిన వారికి మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించడమేనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పు అని ప్రశ్నించారు. జిల్లాలో పార్టీని వీడిన ఇద్దరు ముఖ్య నేతల పరిస్థితి ఒకరిది మహాకవి శ్రీశ్రీలాగా ప్రపంచ బాధంతా ఆయనదే అవుతోందని, మరొకరిది దేవులపల్లి కృష్ణశాస్త్రిలాగా మరొకరు తన బాధను ప్రపంచానికి పంచుతున్నారని చమత్కరించారు. పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దేవుడిలా పొడిగిన నేతలకు ఆయన ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తున్నట్లు మాట్లాడడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరు గంటలు కరెంట్ ఇవ్వలేదన్నారు. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రైతులను రాజులుగా చేసిన సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతం అయిందన్నారు. నేడు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్లు అందుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నెలనెలా పింఛను అందుతున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కల్లూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఒక్కరోజే సత్తుపల్లిలో రూ.125 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో సత్తుపల్లికి నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.