ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పారిస్తున్న నిధుల వరదతో ఏళ్లుగా జరగని అభివృద్ధి అనతి కాలంలోనే కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక కృషితో నగరం రూపురేఖలను మార్చుకొని కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ప్రభుత్వం అభివృద్ధి పనులకు కేటాయించిన రూ.2 వేల కోట్ల నిధులకు తోడు మళ్లీ రూ.1,369 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మున్నేరు నదిపై కాల్వొడ్డు వద్ద తీగల వంతెన, మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ వాల్, మున్నేరుపై మూడు చెక్‌డ్యాంలు, టూటౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గోళ్లపాడు చానల్ పార్క్‌లు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ పార్క్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. యువనేత కేటీఆర్ రాక కోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాగా.. నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.2వేల కోట్లతో చేసిన అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు, నగర సుందరీకరణ పనులు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు కొత్త బస్టాండ్, ఐటీ హబ్, మెగా తాగునీటి ప్రాజెక్టు, లకారం ట్యాంక్ బండ్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నూతన హంగులతో రూపుదిద్దుకుని సేవలందిస్తున్నాయి.
ఖమ్మం, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఖమ్మం నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి బాటలో నడుస్తున్నది. ప్రభుత్వం అభివృద్ధి పనులకు రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయడంతోనే ఈ ప్రగతి సాధ్యమైంది. దీంతో పాటు నగరపాలక సంస్థకు ఏటా విడుదలవుతున్న రూ.100 కోట్ల నిధులతో పాలకవర్గం నగరంలో అంతర్గత రహదారులు, నీటి సరఫరా, డ్రైన్లు, సైడ్ కాలువల నిర్మాణాలు చేపడుతున్నది. రూ.50 కోట్లతో నగరంలో పలుచోట్ల ఏసీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయించింది. అంతేగాక శనివారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు విచ్చేసి ఖమ్మం నగరంలో మరో రూ.1,369 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మం నగరాభివృద్ధిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.

అభివృద్ధి పనులు.. మంత్రి పర్యటన ఇలా..
శనివారం ఉదయం 9-30 గంటలకు మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరానికి చేరుకుని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి తొలుత రూ.180 కోట్లతో ఖమ్మం పరిధిలోని మున్నేరుపై కాల్వొడ్డు వద్ద తీగల వంతెన, రూ.690.52 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా నిర్మించే ఆర్సీసీ వాల్, రూ.30 కోట్లతో నిర్మించే మూడు చెక్ డ్యాంలు, టూ టౌన్లో రూ.180 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 10 గంటలకు గోళ్లపాడ్ చానల్‌పై రూ.108.71 కోట్లతో ఏర్పాటు చేసిన పారులను ప్రారంభించనున్నారు.10.20 గంటలకు రూ.71 లక్షలతో 20వ డివిజన్లో నిర్మించిన కేఎంసీ టఫ్ కోర్టు, 10.35 గంటలకు లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌ను ప్రారంభించనున్నారు. లకారం వద్ద రూ.10 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.249.50 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. గట్టయ్య సెంటర్లో రూ.8.54 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. 11.15 గంటలకు ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించే రోడ్లు, నగరపాలకసంస్థ కార్యాలయంలో రూ.100 కోట్లతో నిర్మించే టీయూఎఫ్ ఐడీసీ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో ‘పట్టణ ప్రగతి’ అధికారులను సమీక్షించనున్నారు. మంత్రి కేటీఆర్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.
అన్ని విధాలుగా నగరాభివృద్ధి..
రూ.4 కోట్లతో నగరంలోని లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పనులు పూర్తయ్యాయి. చానల్‌పై సుందర వనాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.70 కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తయ్యాయి. నగరంలోని టేకులపల్లిలో 1,210 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల అప్పగింత జరిగింది. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీలు, 589 గ్రామ పంచాయతీల్లో పథకం విజయవంతమైంది. ప్రతి పట్టణం, గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. పారిశుధ్య పనులు, చెత్తను తరలించేంపదకు ట్రాక్టర్, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు నీరు పెట్టేందుకు ట్యాంకర్ సమకురాయి. వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నిరుపయోగంగా ఉన్న బావులు, శిథిలమైన బావులు నేలమట్టమయ్యాయి.
స్థానిక సంస్థల బలోపేతం..
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు చిన్న చిన్న తండాలు, మారుమూల పల్లెలు, గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఎన్నో పల్లెలు ఇప్పుడు పంచాయతీలుగా మారాయి. దీంతో పాలన సులభతరం అయింది. అలాగే ప్రభుత్వ చొరవతో సత్తుపల్లి, వైరా, మధిర పట్టణాలనూ మున్సిపాలిటీలయ్యాయి. అలాగే ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు, సత్తుపల్లి, వైరా అసెంబ్లీ నియోజకవరాల పరిధిలోని వందలాది గ్రామాలను స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోకి తీసుకురావడంతో అభివృద్ధి సులభతరమైంది.
ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’..
40 ఏండ్లుగా మున్సిపల్ పీఠంపై కూర్చున్న పాలకులు ప్రజల మంచినీటి కష్టాల తీర్చలేకపోయారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.230 కోట్ల నిధులతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయించింది. నగర పరిధిలోని ఒక్కో ఇంటికీ రోజుకు 150 లీటర్ల చొప్పున వచ్చే 30 ఏండ్ల పాటు సరఫరా చేసే విధంగా పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది.
జిల్లాకే తలమానికం ఐటీ హబ్..
ఐటీ రంగాన్ని జిల్లాకేంద్రాలకూ విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటీ హబ్‌లు నిర్మిస్తున్నది. వీటి ద్వారా అంతర్ జిల్లా అభ్యర్థులకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులో రూ.25 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఐటీ హబ్‌లో వందలాది మంది యువతీ యువకులు కొలువులు చేస్తున్నారు. త్వరలో రూ.36 కోట్ల నిధులతో రెండో దశ ఐటీ హబ్ పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.23 కోట్లతో కార్పొరేషన్ కార్యాలయం..
ఖమ్మం మన్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా పాత మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు లేవు. మున్సిపల్ అధికారులు సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేసే వెసులుబాటు లేదు. ప్రజలకు పార్కింగ్ సౌకర్యమూ ఉండేది కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం అన్ని వసతులతో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.
పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు..
జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనరేట్ నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పుడు నగరంలోని పాత పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో అన్ని వసతులతో కమిషనరేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు సత్తుపల్లి, ఖమ్మం, ఖమ్మం రూరల్, వైరా పోలీస్ సబ్డివిజన్లలో ఏసీపీల కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
రూ. 25 కోట్లతో బస్టాండ్..
దశాబ్దాల క్రితం నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఖమ్మంలో బస్టాండ్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఆ నిధులతో బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు పట్టణ జనాభా పెరుగుతూ వస్తున్నది. క్రమంగా వాహనాల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం అయిపోయింది. పట్టణం నగరపాలక పాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత సమస్య జటిలమైంది. సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నూతన బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.25 కోట్ల నిధులతో నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో బస్టాండ్‌ను నిర్మించారు. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ బస్టాండ్‌ను ప్రారంభించారు. దీంతో నగరవాసుల సమస్యలకు పరిష్కారం లభించింది.