ఖమ్మం, ఆగస్టు 9 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లితో తుమ్మల సమావేశమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేయాలని మంత్రి జూపల్లిని తుమ్మల కోరారు.
తుమ్మల విజ్ఞప్తి మేరకు ఈ నెల 12వ తేదీన ఉమ్మడి ఖమ్మంలో మంత్రి జూపల్లి పర్యటించనున్నారు. పాలేరు రిజర్వాయర్, కూసుమంచి శివాలయం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఖమ్మంఖిల్లాపై రోప్ వే, లకారం ట్యాంక్‌బండ్, వెలుగుమట్ల అర్బన్పారును మరింత అభివృద్ధి చేయాలన్నారు.
వైరా రిజర్వాయర్, కిన్నెరసాని ప్రాజెక్టు, భద్రాచలం కరకట్ట వద్ద టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. భద్రాచలం రామాయణ థీమ్పార్ ఏర్పాటు, భద్రాద్రి గోదావరి, కిన్నెరసాని అభయారణ్యం, సింగరేణి గనులు, కేటీపీఎస్ పవర్‌ప్లాంట్స్, ఐటీసీ, హెవీ వాటర్‌ప్లాంట్ వద్ద వినోదంతోపాటు వైజ్ఞాకంగా పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా పర్యాటక అభివృద్ధి చేయాలని మంత్రి జూపల్లిని తుమ్మల కోరారు.