ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ రఘునాథపాలెం, జనవరి 14 : కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరుగనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో అక్కడి సభా ఏర్పాట్లను, సభా ప్రాంగణాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. 2014లో మాయమాటలతో పరిపాలన చేపట్టిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం విఫలమైందనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీకి అవకాశాన్ని ఇస్తే 8 ఏళ్లుగా కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతోందని మండిపడ్డారు. బీజీపీని నమ్మి ప్రజలు పాలనను అప్పగిస్తే.. కాంగ్రెస్‌ను మించి ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ వాటిని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెడుతోందని విమర్శించారు.
నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న కుట్రపూరిత చర్యలను బీజేపీయేతర రాష్ర్టాలు గమనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఇతర రాష్ర్టాలూ గమనిస్తున్నాయన్నారు. తెలంగాణ తరహా పాలన కోసం అనేక రాష్ర్టాల ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణను నెంబర్ వన్‌గా మార్చిన కేసీఆర్ నాయకత్వాన్ని ఆయా రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారన్నారు. అభివృద్ధి చేస్తున్న రాష్ర్టాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు అభినందించాల్సింది పోయి రాజకీయ కారణాలతో వాటి అభివృద్ధిని అడ్డుకోవాలనే కుటిల పన్నాగాలకు పూనుకుంటోందని విమర్శించారు. ఇది హేయమైన చర్య అని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే బీజేపీయేతర రాష్ర్టాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేస్తున్న ద్రోహపూరిత వైఖరిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరినీ ఐక్యం చేయాలని ఆలోచిస్తున్నటుల చెప్పారు.
మోదీ కుట్రపూరిత చర్యలను దేశ ప్రజలందరికీ ఒక వేదకగా తెలియజేసేందుకు ఖమ్మాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ బహిరంగ సభకు తెలంగాణతోపాటు ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. మారుతున్న కొత్తదనానికి అనుకూలంగా దేశ ప్రజలకు పాలనను అందించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్న కేసీఆర్ ముందుకు వచ్చి బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు. లక్షలాది మందితో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ దేశ భవిశ్యత్తుకు సరికొత్త దిశానిర్దేశాన్ని ఇవ్వబోతోందని అన్నారు. మంత్రి వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.