మధిర, జనవరి 16: వైరా మున్నేరుపై జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని, అదే విధంగా ఇదే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కాలువలను ఆధునీకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరు ప్రాజెక్ట్ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో టెండర్ల ప్రక్రియ పూర్తయి, పురోగతిలో ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు.
వీధి వ్యాపారుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ట్యాంక్‌బండ్ రోడ్డు వెడల్పునకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలల భవనాలను రెసిడెన్షియల్ విద్యాలయాలకు కేటాయించాలన్నారు. స్నానాల లక్ష్మీపురం దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కనెక్టివిటీ లేని అనుబంధ గ్రామాల్లో రోడ్ల నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. అనంతరం పట్టణంలో రూ.34 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాసుపత్రి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తర్వాత పట్టణంలో రూ.2.66 కోట్లతో నిర్మించిన మినీస్టేడియాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను సందర్శించారు. డిప్యూటీ సీఎం వెంట మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, వైస్‌చైర్మన్ శీలం విద్యాలత, ఇరిగేషన్‌శాఖ సీఈ విద్యాసాగర్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్‌శర్మ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి.మాలతి, ఖమ్మం ఆర్డీవో జీ.గణేశ్, ఆరోగ్యశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి సుమన్‌చక్రవర్తి పాల్గొన్నారు.