ఖమ్మం, జూలై 12: బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని స్థాయి నుంచి మెట్రో నగరాలకు దీటుగా నిలిచే స్థాయి వరకూ ఖమ్మాన్ని తీర్చిద్దామని అన్నారు. రూ.3.80 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50, 48, 42, 38 డివిజన్లలో ఒక్కో డివిజన్లో రూ.90 లక్షలతో సీసీ డ్రెయిన్లను నిర్మించనున్నట్లు చెప్పారు.
వైరా రోడ్డులో రూ.20 లక్షల సుడా నిధులతో నిర్మించిన వీడీఎఫ్ టెక్నాలజీ సీసీ రోడ్డును ప్రారంభికోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.50 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, రూ.12 కోట్ల సుడా నిధులు, రూ.20 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఖమ్మంలో మరో రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, ఆదర్శ్ సురభి, దోరేపల్లి శ్వేత, కృష్ణలాల్, రంజిత్, నవ్యజ్యోతి, స్వరూపరాణి, రాపర్తి శరత్, తోట గోవిందమ్మ, రామారావు, పాకాలపాటి విజయ శేషగిరిరావు, పసుమర్తి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.