ఖమ్మం, జనవరి 8: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వారు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు. బీఆర్ఎస్కేవీ అనుబంధం గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం(ఆశ) ఖమ్మం జిల్లా 3వ మహాసభలు ఖమ్మం నగరంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగాయి. ఈ సభలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ లాంటి భయంకర పరిస్థితుల్లో ఆశ వర్కర్లందరూ ప్రతి ఒక్కరినీ సొంత తోబుట్టువులా భావించి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడి వారి సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలులో స్మార్ట్ఫోన్లు ఆశ వర్కర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత క్లిష్ట సమయంలో ఆశ వర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొవిడ్ సమయంలో ఆశ కార్యకర్తలే లేకపోయింటే ఇంకా ఎక్కువగా ప్రాణం నష్టం జరిగి ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆశ వర్కర్లకు నిత్యం అండదండగా నిలుస్తుందని అన్నారు. ఆశలకు వేతనాలు పెంచి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు రాంబాబు, జిల్లా అధ్యక్షురాలు కరుణ, నాయకులు పాల్వంచ కృష్ణ, నాగేశ్వరరావు, పాషా తదితరులు పాల్గొన్నారు.