ఖమ్మం సిటీ, మే 22: క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికి తీసేందుకే ‘సీఎం కప్’ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కూనారిల్లుతున్న పటేల్ స్టేడియాన్ని ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దామని, మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ.2 కోట్లతో జిమ్నాజియానికి వేరుగా ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రూ.4 కోట్లతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని, బాస్కెట్‌బాల్, రెండో స్విమ్మింగ్ ఫూల్, ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో టెన్నిస్ కోర్టులు, రూ.25 లక్షలతో సింథటిక్ స్కేటింగ్ ట్రాక్‌లను నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లోనూ రూ.2 కోట్లతో బాస్కెట్‌బాల్ ఇండోర్ స్టేడియం నిర్మించామన్నారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే అద్భుతమైన క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దామన్నారు.
కొందరు వెర్రి కూతలు కూస్తున్నారు..
అన్ని రంగాలకు సమ ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నదని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వందలాది కోట్ల నిధులతో ఖమ్మాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సకల సౌకర్యాలతో ఖమ్మం ప్రజలంతా సంతోషంగా ఉంటే కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడి నుంచో వచ్చి వెర్రి కూతలు కూస్తున్నారని విమర్శించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. మండల, మున్సిపాలిటీ స్థాయి పోటీల్లో 6200 మంది క్రీడాకారులు పోటీ పడ్డారని తెలిపారు. అన్ని క్రీడల్లో కలిపి మొత్తం 1,233 మంది క్రీడాకారులు జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొన్నారని వెల్లడించారు. సీపీ విష్ణు వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు బచ్చు విజయ్‌కుమార్, లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ స్నేహలతా మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఈవో సోమశేఖర శర్మ, డీవైఎస్వో పరంధామరెడ్డి పాల్గొన్నారు.