ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 4 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భూకంపం సంభవించింది. ఉదయం 7:25 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ హఠాత్ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఖమ్మం జిల్లాలో సుమారు 30 ఏండ్ల తరువాత హఠాత్తుగా భూకంపం సంభవించడంతో ఆందోళన కలిగిస్తున్నది. 7 సెకన్లపాటు భూమి కంపించినట్లు ఖమ్మంజిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది. ఉదయాన్నే వివిధ పనుల్లో నిమగ్నమైన ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయారు.
ఇండ్లలో ఉన్న వంట సామగ్రి కిందపడిపోవడం, మంచాలు ఊగడం, సామానులు కిందపడడంతో భయానికి గురయ్యారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలాచోట్ల ఇండ్లలో వంట సామాన్లు పై నుంచి కిందపడిపోయాయి. కొంతమంది ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం పరిధిలోని అన్ని మండలాల్లో భూమి కంపించింది. సింగరేణి ప్రాంతం కావడంతో ఎక్కువ ప్రమాదం ఇక్కడే పొంచి ఉందని జనం భయపడిపోతున్నారు.