కొత్తగూడెం గణేశ్ టెంపుల్, జనవరి 27: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా రేవంత్ సర్కారు తమను మోసం చేసిందని మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకురాలు సత్తెనపల్లి విజయలక్ష్మి మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల ఊసే మర్చిపోయారని విమర్శించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా నగదు, బిల్లులు చెల్లించాలని, వంటశాలల్లో సౌకర్యాలు కల్పించాలని, గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘం నాయకులు కంచర్ల జమలయ్య, బండి నాగేశ్వరరావు, గిరి, ప్రభావతి, మంగా సరోజచ బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.