ముదిగొండ, ఏప్రిల్ 21: సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమ రాజ్యం సాధ్యమైందని, సంక్షేమ పాలన అలాగే కొనసాగాలంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం వచ్చాకే తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లతో బంజరు భూములు సాగుభూములయ్యాయన్నారు. నాటి పాలకులు దండగ అన్న వ్యవసాయం ఇప్పుడు పండగైందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు.
ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ నేతలు బాగుపడ్డారే కానీ, రైతులు, ప్రజలకు జరిగిన మేలేమీ లేదన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవల దేశవ్యాప్తంగా 46 పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయగా వాటిలో రాష్ర్టానికి చెందిన 13 పల్లెలు ఉండడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లేదా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్క గ్రామమైనా అవార్డును దక్కించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రం మాత్రం సింగరేణి గనులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. నిధులన్నింటినీ గుజరాత్‌కు తరలిస్తున్నదని ధ్వజమెత్తారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కేంద్రం అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించారు. ఇటీవల కొందరు బీఆర్ఎస్ను వీడి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని, వారి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మండల కార్యదర్శి గడ్డం వెంకటి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ముదిగొండ సొసైటీ చైర్మన్ యలగొండ స్వామి, ఆత్మ కమిటీ డైరెక్టర్ స్వాతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, సర్పంచులు మందరపు లక్ష్మి, కోటి అనంతరాములు, సామినేని రమేశ్, జక్కర్, ఎంపీటీసీలు విజయ, మాధవి, రమేశ్, నాయకులు బండ్ల వాసు, మందరపు ఎర్ర వెంకన్న, పచ్చ సీతారామయ్య, పసుపులేటి వెంకట్ బంక మల్లయ్య, భిక్షం, షేక్ ఖాజా, యాకుబ్, పద్మనాభం పాల్గొన్నారు.
కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి రాష్ట్రం సాధించే వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి విజయం సాధించారు. ప్రతిపక్షాల ఆరోపణలు, అసత్యాలను తిప్పికొట్టాలంటే కార్యకర్తలు, నాయకులూ అంతే సిద్ధంగా ఉండాలి. నేల విడిచి సాము చేయకుండా పార్టీ ఆదేశాలను శిరోధార్యంగా భావించాలి. కొందరు నాయకులు తాము పిలుపు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారని విశ్వసిస్తున్నారు. వారికి పరాభవం తప్పదు. వారి మాటలు నమ్మొద్దు. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు వస్తాయి. పార్టీ అంతర్గత సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అందరినీ కలుపుకోవాలి. బూత్‌ల వారీగా ఇన్చార్జులను నియమించాలి. సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం కావొద్దు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షాలకు లీడర్లు, కార్యకర్తలు లేరని, వారి పార్టీల్లో లోపాలను మనం అనుకూలంగా మలచుకోవాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి. పంటలకు రోజుకు ఎన్ని గంటల పాటు కరెంట్ ఇచ్చారో చెప్పాలి. రైతులు ప్రాణాలు తీసుకుంటే వారి కుటుంబాలకు ఏం చేశారో చెప్పాలి. ప్రస్తుత మధిర ఎమ్మెల్యే నాడు చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ప్రజలకు పైసా ప్రయోజనం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల పాటు పంటలకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకంతో తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నది ఎమ్మెల్యేకు కనిపించడం లేదు. కేసీఆర్ పరిపాలనలో అన్నివర్గాలు సుభిక్షంగా ఉన్నాయి. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలి. వచ్చే ఎన్నికల్లో మధిరలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి.
– ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
ఎన్నికలు సమీపిస్తున్నందున కార్యకర్తలు సమాయత్తం కావాలి. సీఎం కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయం అందించి ముఖ్యమంత్రిని చేయాలి. పార్టీ బలాబలాలను ఆత్మావలోకనం చేసుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం. బీఆర్ఎస్ గురించే కాకుండా ప్రతిపక్ష పార్టీల కదలికలనూ గమనించాలి. వారి ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపి వారి ఆదరాభిమానాలు పొందాలి. బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టేలా పనిచేయాలి.
– సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, కొండబాల కోటేశ్వరరావు