– ఎకరానికి రూ.19 లక్షలు, గజానికి రూ.6,300 ఇస్తామన్న అధికారులు
– 10 శాతం అయినా పెంచాలని ప్రాధేయపడ్డ నిర్వాసితులు
– జేసీ, ఎస్డీఎల్ సీ తో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
– మరో సమావేశంలో రేటు ఫైనల్ చేద్దామని అధికారులతో చెప్పిన ఎమ్మెల్యే
కారేపల్లి, ఏప్రిల్ 04 : డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిర్ణయించిన రేటును స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రకటించారు. వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.19 లక్షలు, ఇళ్ల స్థలాలకు గజానికి రూ.6,300 చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల భూ సేకరణలో చెల్లించిన రేట్లనే చెల్లిస్తామని అధికారులు పేర్కొనడంతో దానికి నిర్వాసితులు అంగీకరించలేదు. నాన్ ఏజెన్సీ విషయంలో అక్కడి భూముల ధరలను కూడా పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని బాధితులు కోరారు. 10 శాతం అయినా పెంచాలని భూ నిర్వాసితులు ప్రాధేయపడ్డారు. రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పరిహారం పెంచడంలో అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించమని నిర్వాసితులు కోరారు. వారం రోజుల లోపలనే మరోసారి ఏర్పాటు చేసే సమావేశం నాటికి ఆలోచించుకుని నిర్ణయం తెలపాలని అధికారులు పేర్కొన్నారు.
కలెక్టరేట్ లో శనివారం భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశానికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సిద్ధమయ్యారు. కానీ అత్యవసర పనుల వల్ల కలెక్టర్, జేసీ సమావేశానికి రావడం లేదని తెలపడంతో ఎమ్మెల్యే ఫోన్లో జేసీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి తో మాట్లాడారు. రైతులు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. మరో సమావేశానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని అధికారులు, భూ నిర్వాసితులతో చర్చించి ఆ సమావేశంలో రేటు ఫైనల్ చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.