అశ్వారావుపేట, అక్టోబర్ 11 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఇందిరమ్మ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. శనివారం నారాయణపురం గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతుల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చిందని, అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని సూచించారు. తొలుత బచ్చువారిగూడెంలో ఓ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను మెచ్చా ఆశీర్వదించారు. ఆయన వెంట పార్టీ నాయకులు మందపాటి రాజమోహన్‌రెడ్డి, చందా లక్ష్మీ నర్సయ్య, రాజశేఖర్, మిండా దుర్గారావు, తల్లాడ వెంకటేశ్వరరావు, సోమ్లా, నల్లపు చంద్రరావు, కాటూరి నాగేంద్ర, రమణయ్య, నాగయ్య, చిలకయ్య, అర్జున్, కుమారస్వామి, శివ, నరేశ్, రమణ, రమేశ్ తదితరులు ఉన్నారు.