అశ్వారావుపేట, ఏప్రిల్ 16: హనుమకొండ జిల్లాలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలోని షిర్డీ సాయి నగర్లో బుధవారం వాల్ రైటింగ్‌తో ప్రచారం ముమ్మరం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలన స్వర్ణయుగంలా నడిచిందని, అన్ని వర్గాల రైతులు, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీయేనని ప్రజలు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్ర సాధనతోపాటు కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ నిర్వహించనున్న రజతోత్సవ వేడుకలకు తరలిరావాలని శ్రేణులను కోరారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, తాడేపల్లి రవి, మందపాటి రాజమోహన్‌రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, మోటూరి మోహన్ తదితరులు ఉన్నారు.