కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు.. హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం అలవాటుగా మారిన కాంగ్రెస్ సర్కార్‌ను యువత అసలే నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిస్తే.. అధికారంలోకి రాగానే రైతులందరికీ రుణమాఫీ అన్నారు.. అతికొద్దిమందికే చేశారు. రైతుబంధు మూడు, నాలుగు ఎకరాలకే పరిమితం చేశారు. ఆత్మీయ భరోసా అంటూ ఉపాధిహామీలకు మొండి‘చేయి’ చూపారు.
ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. ఇంతవరకు ఎక్కడా ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపానపోలేదు.. మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, పింఛన్ల పెంపు, కొత్త పింఛన్లు, జాబ్ క్యాలెండర్ అసలు వీటి ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడొచ్చి ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో హడావుడి చేస్తుండడంతో యువత ఒక్కరు కూడా నమ్మడం లేదు. పథకానికి దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులను ఎవరినీ పలుకరించినా రుణం వస్తుందని ‘మాకు నమ్మకం లేదు సారూ..’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– రఘునాథపాలెం, ఏప్రిల్ 10
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు కూసింత నమ్మకం కూడా లేకుండాపోయింది. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను పక్కనపెట్టి.. కాంగ్రెస్ ఇస్తామన్న పథకాలను ఇయ్యక ఊరూరా.. వాడవాడా..! జనాగ్రహాన్ని మూటగట్టుకున్నది. మేనిఫెస్టోలోని హామీలకే దిక్కులేదు.. ఇక అందులో లేనివి అమలు చేసేనా..? అనే ప్రశ్నలు కొత్తగా తెరపైకి వచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి రుణాలను ఇస్తామంటూ ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో ఉపాధి కోసం బ్యాంక్ రుణాలు ఇస్తామంటూ పథకం అమలుకు ముందే అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నది.
యూనిట్ కాస్ట్‌ను బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చునని ఆశలను కల్పిస్తోంది. ఈ పథకం కింద రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ తెగ హడావుడి చేస్తోంది. అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు అందరూ దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. శాఖలవారీగా జిల్లాస్థాయిలోని అన్ని కార్పొరేషన్ అధికారుల నుంచి ఐఏఎస్‌ల వరకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ పెద్దఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరల్ అవుతోంది. అధికారులు ప్రెస్మీట్లు పెట్టి మరీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెబుతుండడంతో ఆశావహులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ప్రచారం చేసుకుంటున్నంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని అమలు చేసేనా అనే అనుమానాలను మాత్రం ఖమ్మం జిల్లాలో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో అమాయకులైన నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసేందుకే కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల దరఖాస్తులు ఆయా మండలాల్లోని తహసీల్దార్, మున్సిపల్, పురపాలక కార్యాలయాలకు అందినట్లు సమాచారం. మరో వారం రోజులు దరఖాస్తుకు గడువు ఉండగా మరో రెండు లక్షల వరకు వస్తాయనేది అధికారులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద రుణం పొందాలంటే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేసింది. అందుకు అవసరమైన పత్రాలు పొందేందుకు ఖమ్మం జిల్లాలోని మీ సేవా కేంద్రాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రుణం పొందాలనే ఆశతో పనులు మానుకొని రోజులతరబడి అవసరమైన పత్రాల కోసం తహసీల్ ఆఫీసుల చుట్టూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పథకానికి దరఖాస్తు చేసుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నదైనప్పటికీ రుణం వస్తే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చనే ఆశతో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే ప్రజల అవసరాలను ‘క్యాష్’ చేసుకునేందుకు తహసీల్ ఆఫీస్ వద్ద తిష్టవేసిన కొందరు దళారులు ధ్రువీకరణ పత్రాల మంజూరు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో బయట కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాలకు వచ్చే జనం తాకిడిని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు సైతం అందినకాడికి క్యాష్ చేసుకుంటున్నారు. దరఖాస్తుకు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు పలువురు వాపోతున్నారు.
సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇకముందు కూడా చేస్తుంది. ఇప్పుడు కొత్తగా యువతీ యువకులను మోసం చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేస్తోంది. ఐప్లె చేసుకుంటే స్వయం ఉపాధి పొందేందుకు వ్యాపార రుణాలు అందిస్తామని చెబుతున్నది. ఖమ్మం జిల్లాలోనే లక్షలకొద్దీ దరఖాస్తులు వస్తున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదు. ఈ పథకాన్ని అమలుచేయాలంటే రూ.6 వేల కోట్లు కోవాలంట.
-బచ్చలకూర భరత్, దరఖాస్తుదారుడు, గుట్టలబజార్, ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రాజీవ్ యువ వికాసం పథకం కింద బ్యాంకు రుణం ఇవ్వాలి. రెండ్రోజులపాటు పనులు మానుకొని పథకానికి దరఖాస్తు చేసుకున్నాను. రుణం వస్తుందో లేదో అనుమానంగా ఉంది. ఖమ్మం జిల్లాలోనే 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారందరికీ రుణం ఇవ్వాలంటే కష్టమే. ఎలాంటి షరతులు పెట్టకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి.
-బానోతు శివలాల్, దరఖాస్తు దారుడు, రఘునాథపాలెం
ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసిన. ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యాపారం పెట్టుకోలేక ఖాళీగా ఉంటున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు ఇస్తామని ప్రచారం చేస్తున్నది. నేను కూడా దరఖాస్తు చేసిన. మాలాంటోళ్లకు రుణం వస్తదో.. రాదో చూడాలి. సర్కారు చెప్పేదొకటి, చేసేదొకటి మాదిరిగా ఉంది.
-గుగులోతు నాగ, ఖమ్మం
ప్రభుత్వానికి ఊరించి మోసగించడమే తెలుసు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతీ యువకులను మోసం చేయడానికే ఈ పథకం అనుకుంటున్నం. దరఖాస్తు కోసం నాలుగు రోజులు మీసేవా, మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. మరి రుణం ఏమాత్రం ఇస్తరో వేచి చూడాలి.
-భుక్యా సరిత, బుర్హాన్‌పురం