ముదిగొండ, మే 23 : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భారీ దొంగతనం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన హనుమంతరావు వేసవికాలం నేపథ్యంలో గురువారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఆవరణలోని వరండాలో నిద్రిస్తున్నాడు. తాళంచెవి దిండు కింద పెట్టుకున్నాడు. దొంగలు చాకచక్యంగా తాళంచెవి తీసి లోపలికి వెళ్లి బీరువాలోని సుమారు 25 తులాల బంగారం, రూ.4 లక్షల నగదును అపహరించుకుపోయారు.
కాసేపటికి మేలుకువ వచ్చి చూడగా తలుపులు తీసి ఉండటంతో ఆందోళనకు గురై లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తీసి ఉన్నట్లు గమనించాడు. పరిశీలించగా బంగారం, నగదు లేకపోవడంతో లబోదిబోమన్నారు. వెంటనే డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగల ఆనవాళ్లు దొరకలేదు. శుక్రవారం రోజు క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.