కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 9: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ‘కగార్’తో దూసుకుపోతున్న భద్రతాదళాలు పెద్దఎత్తున మావోయిస్టులపై ఎదురుదెబ్బ కొట్టారు. మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి వ్యూహాత్మకంగా తమ పాచికలను అమలుచేశారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్‌లు రచించిన వ్యూహానికి మావోయిస్టులు గన్‌డౌన్ చేయక తప్పలేదు. మొత్తం 2,799.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారుల డైరెక్షన్లో భద్రతాదళాలు దూసుకొచ్చాయి.
సుమారు వెయ్యిమందితో ఉన్న సాయుధ బలగాలు నలువైపుల నుంచి చుట్టుముట్టడంతో మావోయిస్టులకు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులపై కాల్పులకు దిగడంతో భద్రతాదళాలు సైతం ఫైరింగ్ ఓపెన్ చేశాయి. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య గంటల వ్యవధిలో జరిగిన పోరులో 31 మంది మావోయిస్టులు సహా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు.
దట్టమైన అటవీప్రాంతం కావడంతో జవాన్లు సైతం కొంత అయోమయానికి గురికావడంతో వారివైపు నుంచి సైతం నష్టం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ల ఖాతాలో ఈ ఎన్కౌంటర్ కూడా చేరింది. డ్రోన్ కెమెరాల సహాయంతో ఈ ఆపరేషన్‌కు లొకేషన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాయుసేనని సైతం ఈ ఆపరేషన్‌కు వినియోగించడంతో భద్రతాదళాలు పైచేయిగా నిలిచారనే విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు భారీసంఖ్యలో భద్రతా దళాలు అడవులను జల్లెడ పడుతూ ఆపరేషన్ ‘కగార్’ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భాలు.. ‘2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీకి కష్టకాలాలు ఎదురవనున్నాయా?’ అనే విధంగా ఉన్నాయి.