రఘునాథపాలెం, మే 10 : ఖమ్మం అర్బన్‌లో గంజాయి బూతం జడలు విప్పుతోంది. కొందరు విద్యార్థులు, యువకులు మద్యంతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. లక్ష్యంవైపు సాగుతూ చదువుపై దృష్టి సారించాల్సిన యువత తప్పటడుగులు వేస్తూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోంది. గంజాయిని సేవించడం సరదాగా అటవాటు చేసుకొని మత్తులో కూరుకుపోతున్నది.
గంజాయి మత్తుకు క్రమక్రమంగా అలవాటుపడిన విద్యార్థులు, యువకులు మాఫియా వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఒక్కసారి గంజాయి మత్తుకు అలవాటుపడి అందులో నుంచి బయటపడలేక కొందరు ఏజెంట్లుగా మారుతున్నారు. గంజాయికి డబ్బుల్లేక దొంగతనాలు, ఇతర నేరాలకూ వెనుకాడటం లేదు. ఇంకొందరు పెద్దఎత్తున కమీషన్ రావడం, ఉచితంగా గంజాయి లభించడంతో స్మగ్లర్లుగా మారుతున్నారు.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు గంజాయి మత్తుకు కొందరు దాసోహం అవుతుండగా.. మరికొందరు ఫేస్ గ్లో పెరుగుతుందనే అపోహతో మరికొందరు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఖమ్మంఅర్బన్ పరిధిలో ఇటీవల కాలంలో గంజాయి వినియోగం ఎక్కువైందనే చెప్పవచ్చు. యువత, విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసగా మారుతున్నట్లు టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసు అధికారుల సోదాల్లో బయటపడింది. మద్యం మత్తులో ఇప్పటికే మునిగి తేలుతున్న యువత క్రమేపీ గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తూ కొత్త మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలియవస్తున్నది. గంజాయి విరివిగా దొరుకుతుండటంతో యువతలో వినియోగం కూడా పెరిగిపోయింది.
నిర్మానుష్య ప్రదేశాలే అడ్డాలు..
ఖమ్మం అర్బన్ పరిధిలో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని గంజాయిని సింగరెట్లలో నింపుకొని వినియోగిస్తున్నారు. 50గ్రాముల గంజాయిని రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి ఆకును సిగరెట్లలో నింపుకుని తాగుతూ మత్తులో తేలుతున్నారు. ఖమ్మంఅర్బన్ పరిధి బల్లేపల్లిలోని శ్మశానవాటిక ఏరియా, కైకొండాయిగూడెం, పాండురంగాపురం శివారు కేఆర్ఆర్ ఫంక్షన్‌హాల్ ప్రాంతం, గోపాలపురం, కొత్తగూడెం, అల్లిపురం, వైఎస్ఆర్ నగర్, పుట్టకోట, బాలప్పేట శివారుప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో తూగుతున్నారు.
పలు పాన్ షాపుల్లోనూ గంజాయి, ఇతర మత్తుమందు చాక్లెట్స్ అమ్ముతున్నట్లు సమాచారం. ఇటీవల ఎక్సైజ్ అధికారుల దాడిలోనూ చాక్లెట్స్ పెద్ద మొత్తంగా పట్టుబడటమే ఇందుకు సాక్ష్యం. ఇప్పటికైనా టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్, పోలీసు అధికారులు గంజాయికి బానిసలుగా మారిన యువతపై దృష్టి పెడితే.. అసలు రవాణా ఎక్కడి నుంచి సాగుతోందనే విషయం తేటతెల్లమవుతుంది.