బంతి సాగు.. లాభాలు బాగు
సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు
- తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం
- సేద్యంపై అవగాహన కల్పిస్తున్న ఉద్యానవనశాఖ అధికారులు
- ఆసక్తి కనబరుస్తున్న రైతులు
- రహదారుల వెంట ఆహ్లాదాన్ని పంచుతున్న పూతోటలు..
మధిర, అక్టోబర్ 11 : సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో రైతాంగం తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఉద్యానవన పంటలపై దృష్టిసారించారు. రైతాంగం స్థానిక అవసరాల మేరకు మార్కెట్లో గిరాకీ ఉన్న బంతిపూల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్నారు.
బంతి సాగుకు ఉపయోగపడే నేలలు
నీరు త్వరగా ఇంకిపోయే నేలలు, గర్షె నేలలు, ఇసుక నేలలు, నీటి తేమ తక్కువగా ఉండే నేలలు బంతి సాగుకు అనువైనవి. ఈ నేలల్లో బంతి పూల పంట సాగు చేయవచ్చు. నీడ తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ పంట అత్యధికంగా బంతిపూలను ఇస్తుంది.
విత్తన మోతాదు, విత్తే పద్ధతి..
ఎకరానికి సరిపడ నారు పెంచడానికి 800-1000 గ్రాముల విత్తనం అవసరం. విత్తనాలను ఎత్తైన మడులు తయారు చేసి విత్తాలి. మళ్ళు తయారు చేసే సమయంలో 1 చదరపు మీటరుకి 8-10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదలు వంటి ఇతర క్రిముల నుంచి రక్షణ పొందవచ్చు. సాధారణంగా 5-7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.
నాటే విధానం..
నెల వయసు 3-4 ఆకులు గల మొక్కలు నాటడానికి అనుకూలం. నారుని సాయంకాలం నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ బంతి మొక్కల్ని 40×30 సెంటిమీటర్ల దూరంలోనూ, కిత్తిరింపులను 30×20 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. ఫ్రెంచ్బంతి మొక్కల్ని 20×20 సెంటీమీటర్ల దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది.
ఎరువులు వేసే విధానం..
చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితోపాటు 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకు 20-40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి.
ఏడాది పొడవునా సాగు..
బంతి సాగును మొదటగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా రైతులు ఏడాది పొడవునా బంతిపూల సాగు చేస్తున్నారు. జూన్, జూలైలో సాగు చేసిన బంతిసాగు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దిగుబడి రావడంతో ఈ నెలలో మంచి గిరాకీ వస్తుంది. విక్రయదారుల అవసరాల మేరకు పండుగల కోసం పూలను రూ.100 వరకు కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో సాగుచేసిన బంతిపూలు డిసెంబర్, జనవరితో పాటు, ఫిబ్రవరిలో ఉన్నటువంటి పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దిగుబడి వస్తుండడంతో మంచి గిరాకీ లభిస్తుంది.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం..
తక్కువ సమయంలో పంట చేతికొచ్చి ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడితో 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా బంతిసాగు రైతులు కనీసం కేజీ రూ.50 నుంచి రూ.100 వరకు మార్కెట్లో బంతిపూలను విక్రయిస్తున్నారు. స్థానికంగా పండుగ సీజన్లో పూలను అమ్ముకుంటూ మిగతా రోజుల్లో ఖమ్మం, మధిర, విజయవాడ వంటి ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు.
రహదారుల వెంట ఆహ్లాదకరంగా..

బంతిపూలు సాగు చేసే రైతులు ఎక్కడా కనిపించని ప్రాంతాల్లో కాకుండా నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల వెంట సాగు చేస్తున్నారు. దీంతో ఆ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులను బంతిపూల తోటలు ఆకర్షిస్తున్నాయి.. సాయంత్రం వేళల్లో అయితే బంతిపూలు వికసించి పూలప్రియులను అబ్బురపరుస్తున్నాయి. ఆహ్లాదకర వాతావారణాన్ని కనబరుస్తున్నాయి. జిల్లాలోనే ప్రధానంగా బంతిపూల సాగు మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, మధిర, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో సుమారు 50 ఎకరాల్లో రైతాంగం బంతిపూల సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు.
బంతిపూల సాగు లాభదాయకంగా ఉంది..
బంతిపూల సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని బంతిపూల సాగు చేశాను. ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. మూడు నెలల్లో పంట సాగు పూర్తయింది. పండుగల సీజన్ కావడంతో స్థానిక మార్కెట్లో కేజీ పూలు రూ.50 నుంచి రూ.100 వరకు అమ్మినాం. ఒక ఎకరాకు పెట్టుబడి ఖర్చులు పోను 80 వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. సాంప్రదాయ పంటల కంటే ఇలాంటి పూల సాగు పంటలే రైతులకు మేలు కలుగుతుంది. వారంరోజులకు ఒకసారి బంతిపూలను కూలీలతో కోయించి ఖమ్మం, విజయవాడ మార్కెట్లకు తరలిస్తున్నాం. మార్కెట్లో కూడా పూలకు మంచి గిరాకీ ఉంది.
– బొడ్డు నరసింహారావు, రైతు, ముష్టికుంట్ల గ్రామం, బోనకల్లు మండలం
మార్కెట్లో బంతిపూలకు గిరాకీ ఉంది
బంతి సాగు పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితులను బట్టి బంతిపూల సాగును జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటివారం వరకు నాటితే మార్కెట్లో పూల సరఫరాను అక్టోబర్, ఏప్రిల్ మాసం వరకు చేయవచ్చు. మధిర నియోజకవర్గంలో బోనకల్లు మండలంలో ఎక్కువగా, మధిర, చింతకాని, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాల రైతులు పూల సాగు చేస్తున్నారు. ఒక ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెడితే రూ.2 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల పూల నాణ్యత పెరిగి మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది. మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
– ఆకుల వేణు, మధిర ఉద్యానవన శాఖ అధికారి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

