కారేపల్లి, డిసెంబర్ 09 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కొత్తతండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ మంగీలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ వ్యాప్తంగా 1,340 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ బలపరిచిన మంగీలాల్ తప్పా ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మంగళవారం సర్పంచ్‌గా ధరావత్ మంగీలాల్ ఏకగ్రీవం అనివార్యమైంది. ఉమ్మడి మాదారం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2014లో ధరావత్ మంగీలాల్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అదే విధంగా అదే కుటుంబం నుండి ఆయన సోదరుడి భార్య ధరావత్ అచ్చమ్మ గత ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందింది. ప్రస్తుతం ధరావత్ మంగీలాల్ కారేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు.
ధరావత్ మంగీలాల్ ఆ పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితుడు కావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఈ నేపథ్యంలో మంగీలాల్ మరోసారి సర్పంచ్ గా అయ్యేందుకు గ్రామ పంచాయతీ ప్రజలంతా ఒక్కటై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎనిమిది మంది వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నట్లు, ఉప సర్పంచ్‌ను బుధవారం గ్రామ పంచాయితీ ప్రజలతో కలిసి చర్చించి ప్రకటించనున్నట్లు మంగీలాల్ తెలిపారు.