కారేపల్లి, జూన్ 17 : అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లిలో వెలుగుచూసింది. పోలంపల్లికి చెందిన అవివాహితుడు మూతి వీరభద్రం (43) అదే గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. 25 రోజుల క్రితం వెస్టేజ్ కంపెనీ మీటింగ్ ఉందని ఇంటి నుండి వెళ్లాడు. రెండు రోజులైన ఇంటికి రాకపోవడం సెల్ ఫోన్ స్విఛాఫ్ ఉండడంతో తల్లిదండ్రులు మూతి బుచ్చిరాములు-లక్ష్మి తమ బంధువుల గ్రామాల్లో వాకబు చేసిన వీరభద్రం జాడ కనిపించలేదు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవి మండలం గుట్టమల్ల సమీపంలోని జామాయిల్ తోటలో శవం ఉందని అక్కడి స్ధానికులు పోలీసులకు తెలుపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించారు. శవం వద్ద సెల్ ఫోన్, ఆధార్ కార్డు పడి ఉండడంతో దాని ఆధారంతో వీరభధ్రంగా గుర్తించి కారేపల్లి పోలీసుల ద్వారా పోలంపల్లికి కబురు చేశారు. ఆ ప్రాంతానికి వెళ్లిన వీరభద్రం తల్లిదండ్రులు, సోదరుడు సుధాకర్ శవాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడంతో పోలీసులు అక్కడే శవ పంచనామా నిర్వహించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు లక్ష్మిదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.