ఖమ్మం రూరల్, డిసెంబర్ 04 : గంజాయి రవాణా కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు.. 19 జనవరి, 2024న ఖమ్మం పట్టణంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గల ఆటో స్టాండ్ వద్ద అప్పటి ఎక్సైజ్ డీటీఎఫ్, ఖమ్మం సీఐ ఆర్.విజేందర్, ఎస్ఐ ఎల్.అచ్చారావు, ఇతర పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రాజస్థాన్‌కు చెందిన భాగ్ చంద్ బైర్వా(31), పింట్ కుమార్ రేగర్(24) ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 22.150 కేజీల ఎండు గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని బైర్వాను ఏ1గా, రేగర్ను ఏ2గా పేర్కొంటూ ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా విచారణ అనంతరం సదరు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. దీంతో కోర్టు ఏ1గా ఉన్న బైర్వాకు 20 ఏండ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. ఏ2 రేగర్ పరారీలో ఉండగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ బోయిన వెంకటేశ్వర్లు, హోంగార్డు ఎండీ ఆయుబ్ సహకరించారు. ఈ సందర్భంగా కేసు విచారణలో పాల్గొన్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లను ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేశ్, ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారి జి.నాగేందర్ రెడ్డి ,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఖమ్మం-2 ఇన్స్పెక్టర్ బి.చంద్ర మోహన్ అభినందించారు.