కారేపల్లి, ఆగస్టు 19 : అప్పుకు డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోవడం పెద్ద మనుషుల్లో పెట్టినా సరైన న్యాయం జరగలేదని మనస్ధాపంతో వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం కారేపల్లి పోలీస్ స్టేషన్ ముందు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి క్రాస్‌రోడ్‌కు చెందిన పాలెపు భద్రం అదే గ్రామానికి చెందిన ఉపేందర్‌కు రూ.5 లక్షలు అప్పు ఇచ్చాడు. తిరిగి చెల్లించమని కోరుతున్నా ఉపేందర్ పెడచెవిన పెడుతున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల ముందు పంచాయతీ పెట్టినా సరైన న్యాయం జరగలేదని భద్రం మనస్ధాపం చెందాడు.
మంగళవారం కారేపల్లి క్రాస్ రోడ్లో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో భద్రం బైక్‌పై కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అక్కడే గడ్డి మందు తాగాడు. విషయాన్ని చూచిన పోలీసులు అతడిని కారేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్ఐ బి.గోపి మాట్లాడుతూ భద్రం స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. అతను ఇదే మొదటిసారి స్టేషన్ రావడం అని తెలిపారు. ఈ విషయమై విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.