ఇల్లెందు, డిసెంబర్ 8: రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివనాయక్ డిమాండ్ చేశారు. తమ తలాపునే సీతారామ ప్రాజెక్టు ఉన్నా నీళ్లను మాత్రం పొరుగు జిల్లాకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. సీతారామ నుంచి మొదటగా ఏజెన్సీ పారతాలకే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీలకు సీతారామ ప్రాజెక్టు నీళ్ల సాధన కోసం సేవాలాల్ సేన చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండో రోజుకు చేరుకుంది.
ఇల్లెందులో శనివారం మొదలైన ఈ యాత్ర ఆదివారం టేకులపల్లి మండలానికి వచ్చింది. టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో శివనాయక్ మాట్లాడారు. ఇల్లెందు నియోజకవర్గ రైతుల కోసం, ముఖ్యంగా భద్రాద్రి జిల్లా రైతుల కోసం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా తొలుత ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీరు అందించకుండా మైదాన ప్రాంతాలకు అందించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ముందుగా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇచ్చాకే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అలాగే గత ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించి డిమాండ్ చేశారు. ఇల్లెందు ఏజెన్సీలోని ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో సేవాలాల్ సేన నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఇస్లావత్ నామానాయక్, బోడ బాలునాయక్, మాలోత్ పూల్సింగ్నాయక్, కృష్ణనాయక్, బానోత్ హుస్సేన్‌నాయక్, అంగోత్ ఆంజనేయులు, సతీశ్, వంశీ, వీరన్న, సురేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.