మధిర, నవంబర్ 22: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కోపమొచ్చింది. మధిర పెద్ద చెరువులో లెక్కా పత్రం లేకుండా మత్స్య శాఖ అధికారులు చేపపిల్లలు వదలడంపై ఆయన మండిపడ్డారు. కేజీలు, ప్యాకెట్ల చొప్పున చేపపిల్లలు వదలడం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హడావిడిగా అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. మధిర పెద్ద చెరువులో చేపపిల్లలు వదిలే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శనివారం హాజరయ్యారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్‌ను ఉద్దేశించి.. ‘పెద్ద చెరువులో ఎన్ని లక్షల చేపపిల్లలు వదులుతున్నారు? కిలోల ప్రకారమా? పిల్లల సంఖ్య ప్రకారమా? అని ప్రశ్నించారు.
‘ఏదో చేపపిల్లలు మంజూరయ్యాయి కదా.. ఎలా ఇచ్చినా సరిపోతుందిలే అనే భావన ఉంటే లక్ష్యం నెరవేరదు. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ కేటాయించిన చేపపిల్లలను లెక్క ప్రకారం సమయానుకూలంగా వదలాలి. ఇష్టం వచ్చినట్లు కేజీల చొప్పున వదిలితే మత్స్యకారులకు నష్టం జరుగుతుంది’ అని సదరు అధికారిని మందలించారు. ఇప్పటికైనా చెరువులకు కేటాయించిన విధంగా లెక్కల ప్రకారం చేపపిల్లలు వదలాలని ఆదేశించారు. మధిర పెద్ద చెరువుకు 1,85,000 చేపపిల్లలు కేటాయించినట్లు మత్స్య శాఖ అధికారి డిప్యూటీ సీఎంకు వివరించారు. చేపల పంపిణీ కార్యక్రమాన్ని కేవలం మత్స్యశాఖకే పరిమితం చేయకుండా నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భట్టి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.