తిరుమలాయపాలెం, ఏప్రిల్ 18 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిపివేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేసిందని తాళ్లచెరువు సర్పంచ్ వెంకటనారాయణ, బీఆర్ఎస్ మండల నాయకుడు ధనుంజయ తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు మొక్కజొన్నలను మధ్యదళారులకు విక్రయించి నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిర్ర కృష్ణయ్య, జక్కుల వీరన్న పాల్గొన్నారు.