కారేపల్లి, ఏప్రిల్ 17 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని మాదారం గ్రామంలో కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మొదటిసారిగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నెలకొల్పడం అందరూ హర్షించదగ్గ విషయమన్నారు. రైతులు పండించిన పంటకు సరైన ధరలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మధ్యవర్తుల బాధలు లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా ఈ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. మొక్కజొన్న క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.
ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మాదారంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఇక్కడ మొక్కజొన్నలు అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, సీఐ నూనావత్ సాగర్, ఎస్ఐ బైరు గోపి, విద్యుత్ ఏఈ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల మంజుల, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, సొసైటీ మాజీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, మాదారం, కొత్తతండా సర్పంచ్ అజ్మీరా ఉమా, ధారావత్ మంగీలాల్ తో పాటు వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మండల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.