యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ.. తెరవెనుక మాయాజాలం భారీగానే జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరిట దోపిడీ యత్నం చేస్తుండడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. బస్తాకు రెండు కిలోల చొప్పున అదనంగా తరుగు తీస్తుండడంతో అన్నదాతలకు మిగిలేదేమీ లేకుండా పోతోంది. అయినప్పటికీ చోద్యం చూస్తున్న ప్రభుత్వం.. కనీస చర్యలకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం.
– చుంచుపల్లి, మే 21
ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చుంచుపల్లి మండలంలోని సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన పెనగడప, అంబేద్కర్‌నగర్, చుంచుపల్లి తండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు అదనంగా రెండు కిలోల చొప్పున ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. 42 కేజీల 200 గ్రాములు తూకం వేస్తున్నారు. అయితే, కాంటా పెట్టి మిల్లర్ల వద్దకు పంపగా మిల్లర్లు వడ్లు మొలకెత్తాయని కొర్రీలు పెట్టి దానిలో సైతం కేజీ తరుగు తీస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు.
లేదంటే కొనుగోళ్లకు ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. ధాన్యం దోపిడీకి రైతులు ఒప్పుకోకపోతే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు బలవంతంగానైనా దోపిడీకి పాల్పడుతున్నారు. వడ్లు పచ్చిగా ఉన్నాయంటూ కొర్రీలు పెడుతున్నారని, తూకం వేయడానికి ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ తరహా చర్యలు వెలుగుచూడడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీ..
యాసంగి పంట సేకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడీకి గురవుతున్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంటను విక్రయించుకునేందుకు రైతులు ధాన్యం తీసుకురాగా.. తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దోచుకుంటున్నారు. క్విం టాలు ధాన్యానికి సుమారు రెండు కిలోల వరకు తరుగు పేరిట అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. ఈ దోపిడీని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ నిరసనలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
రైస్ మిల్లర్ల సిండికేట్..
మండలంలోని పెనగడప, అంబేద్కర్‌నగర్, చుంచుపల్లి తండా పంచాయతీల్లో కొత్తగూడెం సహకార పరపతి సంఘం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల కలెక్టర్ కూడా ఈ కేంద్రాలను పరిశీలించారు. తరుగు రూపంలో 2, 3 కేజీలు అధికంగా తీసుకోవద్దని మీటింగ్ పెట్టి మరీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అయినా సొసైటీ బాధ్యులు ఖాతరు చేయడం లేదు. 42 కేజీల 200 గ్రాములు అయితేనే తీసుకుంటాంమని రైతులకు సొసైటీ అధికారులు స్పష్టం చేస్తుండడంతో చేసేదిలేక దిక్కుతోచని స్థితిలో అమ్ముతున్నారు.
తరుగు దోపిడీకి రైస్ మిల్లర్లు, సొసైటీల బాధ్యులు సిండికేట్‌గా మారారు. అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని రైతులను నిండా ముంచుతున్నారు. గతంలో మాదిరిగానే బహిరంగంగానే 40 కిలోల బస్తాకు 2 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. సన్న వడ్ల సాగు సుమారు 70 శాతం వరకు పెరిగింది. యాసంగిలో వచ్చే ధాన్యాన్ని మర ఆడిస్తే బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తాయి. ఇదే సాకును బూచిగా చూపి రైస్ మిల్లర్లు దోపిడీకి తెగబడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రైతులకు చెల్లింపులు జరిగేలా వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. క్వింటాలు ధాన్యానికి సుమారు 5 నుంచి 6 కిలోల వరకు తరుగు పేరిట పక్కాగా దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా చూస్తూ దానికి పరోక్షంగా సహకరిస్తోంది.
దోచుకుంటున్న దళారులు, వ్యాపారులు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం రైతులను వ్యాపారులు, దళారులు కూడా నిలువునా దోచేస్తున్నారు. పెనగడప పంచాయతీలో 147 ఎకరాల్లో వరిసాగు చేశారు. సుమారు 3,500 నుంచి 4,000 క్వింటాళ్ల ధాన్యాన్ని దళారులు తీసుకెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. పెనగడపలో సొసైటీ బాధ్యులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోగా పంట సాగును దూర ప్రాంతమైన చుంచుపల్లితండా, పెనగడప ప్రాంతాలకు ధాన్యం తీసుకెళ్లి విక్రయించాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకొని ఉండడంతో రైతులు పంట వద్దకు వచ్చే దళారికే విక్రయిస్తున్నారు. యాసంగి పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నా కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాకు రూ.2 వేలలోపే చెల్లిస్తున్నారు.
బస్తాకు 3 కేజీల తరుగు తీస్తున్నారు..
కలెక్టర్ వచ్చి మీటింగ్ పెట్టారు. తరుగు తీయవద్దని చెప్పారు. కానీ.. సొసైటీ బాధ్యులు బస్తాకు రెండు నుంచి మూడు కేజీల తరుగు తీస్తున్నారు. మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి? ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకోవడంలేదు. వడ్లను తూర్పార పట్టినప్పటికీ కొర్రీలు పెడుతున్నారు.
-గంప అచ్చయ్య, రైతు, పెనగడప
కేంద్రం వైపు కన్నెత్తి చూడడం లేదు..
కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో కనీసం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. తరుగు పేరుతో బస్తాకు అదనంగా రెండు కేజీలను ఇక్కడ సొసైటీ అధికారులు తూకం వేసి మిల్లర్లకు పంపిస్తున్నారు. మిల్లర్ల వద్దకు వడ్లు పోయాక వడ్లు బాగాలేవని, మొలకెత్తాయని కొర్రీలు పెడుతున్నారు. అక్కడ మిల్లర్లు కూడా బస్తాకు కేజీ వరకూ తగ్గించారు.
-ఎస్కే అహ్మద్, కౌలు రైతు, పెనగడప