కొత్తగూడెం సింగరేణి, మార్చి 27 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సింగరేణి సంస్థలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సక్రమంగా సరఫరా లేకపోవడం కారణంగా కార్మిక కుటుంబాలతోపాటు కార్మికులు పనిచేసే కోల్‌మైన్స్, వర్క్‌షాప్‌లు, ఇతర డిపార్ట్మెంట్లు, కార్పొరేట్ హెడ్డాఫీస్, సింగరేణి ఆస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్మిక కుటుంబాలకు అవసరమైన గ్యాస్ సరఫరా లేదు. గతంలో మాదిరిగా బుక్ చేసిన వెంటనే సరఫరా చేయలేకపోతున్నారు. గ్యాస్ కోసం నిత్యం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మిక కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించే ఆయా ఏరియా ఆస్పత్రులతోపాటు కొత్తగూడెంలోని మెయిన్ ఆస్పత్రుల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెడ్డాఫీస్తోపాటు కార్మికులు పనిచేసే క్యాంటీన్లలో టిఫిన్లను పూర్తిగా కుదించి వేశారు. ఉప్మా మాత్రమే పంపిణీ చేస్తున్నారు.
రోజుకొక టిఫిన్ చేసే పరిస్థితి లేదు. సింగరేణి హెడ్డాఫీస్ క్యాంటీన్‌ను కూడా బంద్ చేసే పరిస్థితి నెలకొంది. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో వైద్యసేవలు పొందే రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను సరఫరా చేయడానికి కూడా గ్యాస్లేమి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సక్రమంగా సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని అధికారులు తెలిపారు.
కొత్తగూడెంలోని హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ జితేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సమయానుకూలంగా అందిస్తున్నామని, కమర్షియల్ సిలిండర్ల కోసం ఎన్నిసార్లు ఇండెంట్ పెట్టినా గ్యాస్ కంపెనీవారు సరఫరా చేయడంలేదని చెప్పారు. సింగరేణిలోని కొత్తగూడెం ఏరియా వారికి మాత్రమే సిలిండర్లు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు, కార్మిక సంఘాలు వాపోతున్నాయి. అవసరానికి సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని కార్మికులు కోరుతున్నారు.