కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, ఆగస్టు 20: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మద్యం టెండర్లకు అనూహ్యమైన పోటీ నెలకొన్నది. దుకాణాన్ని దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై మంచి రోజు చూసుకొని టెండర్లు వేశారు. మరికొందరు ముందస్తు ఒప్పందాలు చేసుకొని నమ్మకం ఉన్న వ్యక్తులపై, అదృష్ట జాతకుల పేర్లపై క్యూలో నిలబడి మరీ దరఖాస్తులు సమర్పించారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 88 ఏ-4 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించగా.. మొత్తం 5,057 దరఖాస్తులు అందగా.. సర్కార్‌కు రూ.101.14కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 122 దుకాణాలకు 7,207 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వానికి రూ.144.14కోట్ల ఆదాయం వచ్చింది. ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచి ముహూర్తాన దరఖాస్తు చేసుకున్నా.. అదృష్టవంతులు ఎవరనేది సోమవారం తేలనున్నది.
నూతన మద్యం పాలసీకి నిర్వహించిన మద్యం టెండర్లకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. క్రితం సారి మద్యం టెండర్లు దక్కించుకున్న వారు భారీగా ఆదాయాన్ని ఆర్జించడంతో ఈసారి ఔత్సాహికుల సంఖ్య మరింత పెరిగింది. ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమ కుటుంబ సభ్యుల పేర్లతో, మహిళల పేర్లతోనూ దరఖాస్తులు అందించారు. ప్రభుత్వం కొత్త విధానాన్ని నిబంధనలను సరళతరం చేయడం, మద్యం దుకాణాలను పెంచడం, లైసెన్స్ ఫీజు వాయిదాలను పొడిగించడం, ఒకే వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండడం, దుకాణాదారుడికి కమీషన్ పెంచడంతో ఈసారి ఎంతోమంది దుకాణాలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. దరఖాస్తుల దాఖలుకు శనివారం చివరి రోజు కావిడంతో దరఖాస్తుదారులు అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 88 ఏ-4 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించగా మొత్తం 5,057 దరఖాస్తులు అందగా సర్కార్‌కు రూ.101.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 122 దుకాణాలకు 7,207 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.144.14 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీ ప్రక్రియ తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరచుకుంటాయి.
భద్రాద్రి జిల్లాలో టెండర్లు ఇలా..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న 88 మద్యం దుకాణాలు ఉండగా ఏజెన్సీ పరిధిలోని 44 దుకాణాలను ఎస్టీలకు, మిగిలిన 44 దుకాణాల్లో ఆరు గౌడ కులస్తులకు, ఏడు ఎస్సీలకు కేటాయింపు జరిగింది. ఓపెన్ క్యాటగిరీలో 31 మద్యం దుకాణాలకు టెండర్లు జరిగాయి. ఎస్టీలకు కేటాయించిన 44 మద్యం దుకాణాలకు 2,608 దరఖాస్తులు, గౌడ కులస్తులకు కేటాయించిన ఆరు మద్యం దుకాణాలకు 209 దరఖాస్తులు, ఎస్సీలకు కేటాయించిన ఏడు మద్యం దుకాణాలకు 379 దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీ 31 మద్యం దుకాణాలకు 1,861 దరఖాస్తులు వచ్చాయి. గతంలో మద్యం పాలసీ టెండర్లకు 4,271 దరఖాస్తులు రాగా ఈసారి 786 దరఖాస్తులు పెరిగి సంఖ్య 5,057కు చేరుకున్నది. కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 19 మద్యం దుకాణాలకు 1,063 దరఖాస్తులు, పాల్వంచ పరిధిలోని 13 మద్యం దుకాణాలకు 723 దరఖాస్తులు, అశ్వారావుపేట పరిధిలోని 11 మద్యం దుకాణాలకు 869 దరఖాస్తులు, భద్రాచలం పరిధిలోని 16 మద్యం దుకాణాలకు 1,137 దరఖాస్తులు, మణుగూరు పరిధిలోని 15 మద్యం దుకాణాలకు 623 దరఖాస్తులు, ఇల్లెందు పరిధిలోని 14 మద్యం దుకాణాలకు 642 దరఖాస్తులు వచ్చాయి. భద్రాచలం, కొత్తగూడెం స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పాల్వంచ మండలం జగన్నాథపురం కేటీజీ 028 దుకాణానికి 124 దరఖాస్తులు, భద్రాచలంలోని కేటీజీ 044 దుకాణానికి 115 దరఖాస్తులు, ఇదే ప్రాంతానికి చెందిన కేటీజీ 045 దుకాణానికి 115 దరఖాస్తులు, గుండాల మండలం కేటీజీ 087 దుకాణానికి 101 దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి. కాగా ఇల్లెందులోని కేటీజీ 082 దుకాణానికి 22 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో టెండర్లు ఇలా..
2021లో ఖమ్మం జిల్లాలో 122 దుకాణాలకు టెండర్లు నిర్వహించగా 6,212 దరఖాస్తులు అందాయి. ఈసారి మద్యం పాలసీకి ఆ సంఖ్య 7,207కు చేరుకున్నది. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్డు, ఖమ్మం నగరంలోని గోపాలపురం దుకాణాలకు భారీగా దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఇదే తరహాలో ప్రతి మద్యం షాపునకు కనీసం 55 నుంచి 65 చొప్పున దరఖాస్తులు అందాయి. ఖమ్మం-1 ఎక్సైజ్ స్టేషన్ పరిధి నుంచి 1,747 దరఖాస్తులు, ఖమ్మం-2 స్టేషన్ నుంచి 1,175, నేలకొండపల్లి నుంచి 954, వైరా నుంచి 608, మధిర నుంచి 982, సత్తుపల్లి నుంచి 1,214, కారేపల్లి స్టేషన్ నుంచి 421 దరఖాస్తులు వచ్చాయి.
నేడే లాటరీ ప్రక్రియ..
ఖమ్మం నగరంలోని సీక్వెల్ క్లబ్లో, పాల్వంచలోని టీఎస్ జెన్కో హౌసింగ్ కాలనీ భద్రాద్రి ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగనున్నది. ప్రక్రియకు దరఖాస్తుదారులు లేదా వారి ద్వారా అనుమతి పొందిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దరఖాస్తుదారులు లేదా వారి ద్వారా అనుమతిపొందిన వారు ప్రక్రియకు హాజరు కాకుంటే వారి టోకెన్‌ను లాటరీ బాక్స్‌లో కలపడం జరగదు.