రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.155 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో మోడల్ మిర్చి మార్కెట్‌గా తీర్చిదిద్దుతున్నామంటూ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలిస్తే పూర్తి వాస్తుదోషంగా జరుగుతున్నట్లుగా ఉందన్నారు. మార్కెట్ చుట్టూ ప్రస్తుతం ఉన్న 40అడుగుల రోడ్లను కుంచించి 25అడుగులు ఉండేలా చేయడం అభివృద్ధి ఎలా అవుతుందో పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో మార్కెట్‌కు పెద్ద మొత్తంగా మిర్చి తరలివస్తే మార్కెట్లోకి వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
గ్రెయిన్ మార్కెట్ ప్రధాన గేటు నుంచి లోపలి వెళ్లే రోడ్డును తొలగించి భారీ షెడ్లను నిర్మించడం వాస్తుదోషంగా పేర్కొన్నారు. సంక్రాంతి నాటికే మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేసి రైతులకు అప్పగిస్తామని చెప్పిన అధికారులు.. ఆ దిశగా పనులు ముగించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్మోహన్రావు, బీఆర్ఎస్ నాయకులు కస్తూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.