ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం నాలుగో విడతతో ఈ నెల 13న పోలింగ్‌కు సంసిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నా యి. అందులో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో ఆ పెరిగిన ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లో వసతులను ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే దివ్యాంగులకు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించగా అర్హులు అప్పటికే దానిని వినియోగించుకున్నారు. ఇక నిఘా కోసం 22 ఎఫ్ఎస్టీ, 21 ఎస్ఎస్టీ, 37 ఎంసీసీ బృందాలు పనిచేస్తున్నాయి. 203 మంది సెక్టార్ అధికారులు విధుల్లో ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు అధికార యంత్రాం గం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టులు,10 ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్‌పోస్టులు ఏర్పాటు ఏర్పాటు చేసి వాటి ద్వారా 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
‘ఖమ్మం’ బరిలో 35 మంది..
ఖమ్మం పార్లమెంట్ స్థానం బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో నలుగురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు. మిగతా 31 మంది అభ్యర్థులు వివిధ రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, ఏ పార్టీలతో సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,084 లోకేషన్లలో 1,896 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 7,584 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఓపీవో అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. 103 లోకేషన్లలో 230 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల లోపల వంద శాతం సీసీ కెమెరాలు అమర్చి ఉంచారు. పోలీస్ శాఖ సూచనల ప్రకారం అవసరమున్న అన్ని పోలింగ్ కేంద్రాల వెలుపల కూడా సీసీ కెమెరాలను అమర్చారు. ఖమ్మం అసెంబీ ్లసెగ్మెంట్లో 355, పాలేరులో 290, మధిరలో 268, వైరాలో 216, సత్తుపల్లిలో 294, కొత్తగూడెంలో 253, అశ్వారావుపేటలో 184 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ర్యాండమైజేషన్ పూర్తి చేసిన ఈవీఎంలను కేటాయించి వాటిని స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 7,87,160 మంది పురుషులు, 8,43,749 మంది మహిళలు,130 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారు. కాగా, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయినప్పటికీ.. అవి అందని ఓటర్లు కూడా ఈసీ సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపి ఓటు వేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.