మధిర, మార్చి 7: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీడాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్‌రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల అయినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించడానికి డిప్యూటీ సీఎంకు తీరిక దొరకడం లేదా? అని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని ఆనాటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారని, దీంతో గత సీఎం కేసీఆర్ వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసి భవన నిర్మాణాలు పూర్తి చేశారని గుర్తు చేశారు. వెంటనే ఆసుపత్రిని ప్రారంభిస్తే ఎర్రుపాలెం, బోనకల్లు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ పనికైనా మీకెంత, మాకెంత అనే విధానంలో సాగుతున్నదని విమర్శించారు. కేవలం డబ్బులు వచ్చే పనులపైనే కాకుండా ప్రజలకు అవసరమైన, ఉపయోగకరమైన పనులపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎంను కోరారు. మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు బొగ్గుల భాసర్‌రెడ్డి, కటికల సత్యనారాయణరెడ్డి, అరగ శ్రీనివాసరావు, పాల్వంచ రామారావు, పరిశా శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, ఎన్నంశెట్టి అప్పారావు, చిదిరాల రాంబాబు, కొత్తపల్లి నరసింహారావు, ఎంవీఎస్ ప్రసాద్, కోటేశ్వరరావు, జయమ్మ, తాటికొండ వెంకటేశ్వర్లు, అమరవాది కోటిరెడ్డి పాల్గొన్నారు.