ఎర్రుపాలెం/ మధిర, ఫిబ్రవరి 16: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు అన్నారు. ఎర్రుపాలెం మండలంలో ఆదివారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అయ్యవారిగూడెంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదని, వారి కుటుంబాన్ని వెలివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే మాట్లాడడం సమంజసం కాదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సమగ్ర సర్వేను రాష్ట్ర ప్రజానీకం మొత్తం బహిష్కరించాలని మాట్లాడిన మాటలు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి అబద్ధపు ఆరు గ్యారెంటీలను హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అటకెక్కించిందన్నారు.
కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన సోమవారం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని మధిర నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణారావు, తిరుపతిరావు, వెంకటనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. మధిరలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కమల్‌రాజు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.