అనతికాలంలోనే పాలేరు అభివృద్ధి.. కందాళ ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
పాలేరులో అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి మత్స్య, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అనేక జాతీయ రహదారుల కూడలిగా ఖమ్మం రూరల్ మండలం అవతరించబోతోంది. ఎన్నికల వాతావరణం రాగానే ఆరుద్ర పురుగుల్లాగా సీజనల్ నాయకులు వస్తున్నారు. ఇక్కడ ఎవరి మాయమాటలూ నడవవు. బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం. కార్యకర్తలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా అదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయం, ఐకమత్యంతో పనిచేసి సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలి.
“పార్టీకి కార్యకర్తలే ‘బలం, బలగం’.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించి హ్యాట్రిక్ సాధిస్తుంది.. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారు” అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఆదివారం ఖమ్మం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఖానాపురం హవేలీ పరిధిలోని 14 డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్న అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ని సీఎం కేసీఆర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా తీసుకుపోతూ తెలంగాణ అభివృద్ధిని మోడల్‌గా చూపుతున్నారన్నారు.
జిల్లాలో కొందరు పదవులు రాలేదని, కాంట్రాక్టులు పొందినా ఇంకా అసంతృప్తితో తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టనీయనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికే వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి మంగమ్మ శపథాలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడంలో ఖమ్మం జిల్లా పాత్ర ప్రధానంగా ఉండాలన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. రెండుచోట్లా ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరిగాయి.
– రఘునాథపాలెం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 16
శ్రేణులు సన్నద్ధం కావాలి తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరపాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప నుంచి వచ్చిన వారు కాసేపు హడావిడి చేసి కనుమరుగయ్యారు. ఇప్పుడు మరొకరు ధనబలంతో మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు తాకాలంటే ప్రజల ఆశీర్వాదం కావాల్సి ఉంటుంది. అది బీఆర్ఎస్కు పుష్కలంగా ఉంది. గ్రామాల్లో మెజార్టీ వంతుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నాయకులు ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అదే తరహాలో పనిచేయాలి.
రఘునాథపాలెం, ఏప్రిల్ 16 : ‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బల గం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. పార్టీకి వెన్నెముక అయిన కార్యకర్తలు లేకుంటే తమకు ఈ పదవులే లేవన్నారు. తమ చర్మంతో కార్యకర్తలకు చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలకు తానూ కట్టుబడి ఉంటానని అన్నారు. ఖానాపురం హవేలీ పరిధిలోని 14 డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ‘ఆత్మీయ సమ్మేళనం’ ఖమ్మంలోని మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడారు.
పార్టీకి మూలస్థంభాలైన కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ ‘ఆత్మీయ సమ్మేళనాల’కు పిలుపునిచ్చారని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలున్న అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘అభివృద్ధి అంటే ఇట్లుండాలె’ అనే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున చేపట్టారన్నారు. ఒక్కో జిల్లాకు రూ.వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలుపుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు బీఆర్ఎస్కు తప్ప మరే పార్టీకీ లేదన్నారు. ఓటుకు నోటు కేసులో పక్కాగా దొరికిపోయి జైలు పాలైన వాళ్ల్లు నేడు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేయకుంటే మీకు టీపీసీసీ వచ్చేదా? టీబీజేపీ ఉండేదా? అని ప్రశ్నించారు.
పదవులు దక్కనందుకే కొందరి అక్కసు..
పదవులు రాలేదని, టికెట్టు లభించలేదని, కాంట్రాక్టులు పొందినా ఇంకా సంతృప్తి లేదనే కారణాలతోనే మంగమ్మ శపథాలు చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మంత్రి అజయ్‌కుమార్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కరినీ అసెంబ్లీలో అడుగుపెట్టనీయబోనంటూ ఉత్తరుకుమారులు పలికే ప్రగల్బాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు, కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో గెలిచిన తాను నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఖమ్మం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పని చేశానని అన్నారు. మంత్రిగా సుమారు రూ.1300 కోట్ల నిధులు తీసుకొచ్చి ఖమ్మం నియోజకవర్గాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. ప్రతి కార్యకర్తా తలెత్తుకుని ఓట్లడిగే విధంగా పనులు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. తనను అసెంబ్లీకి వెళ్లనీయబోనంటూ కొందరు చేసే మంగమ్మ శపథాలు ఎందుకని ప్రశ్నించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 8,106 మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసినందుకా? సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకు రూ.20 కోట్లు సాయంగా అందించినందుకా? ఖమ్మంలో 2 వేల మంది పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి సొంతింటి కలను సాకారం చేసినందుకా? ఏ ఆధారమూ లేకుండా ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్న 4 వేల మంది పేదలకు 58 జీవో ద్వారా ఉచితంగా క్రమబద్ధీకరణ చేసి పట్టాలు అందించినందుకా?’ అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడంలో ఖమ్మం జిల్లా పాత్ర ప్రధానంగా ఉండాలన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీ మెట్లు ఎక్కించి మంగమ్మ శపదాలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అతిపెద్ద కర్తవ్యం మన కళ్లముందు ఉన్నందున ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మన ఇల్లు, మన కుటుంబం బాగుండాలని కోరుకున్నట్లే మన పార్టీ కూడా బాగుండాలని ప్రతి కార్యకర్తా కోరుకోవాలని ఆకాంక్షించారు.
ఆవిర్భావ వేడుకలు అదరాలి
ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25న ఖమ్మం నియోజకవర్గంలో వాడవాడలా అదిరిపోయేలా వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. అదేరోజు సాయత్రం పార్టీ నియోజకవర్గ సమావేశం అతిపెద్ద గ్రౌండ్లో జరుగుతుందన్నారు. అందుకు కార్యకర్తలందరూ సన్నద్ధులై ఉండాలన్నారు. మే 14న హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ తల్లి సర్కిల్ సమీపంలో 30 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు చావా నారాయణరావు ఆధ్వర్యంలో 25 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక హనుమాన్ విగ్రహానికి పక్కనే 2 వేల చదరపు గజాల్లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా సమ్మేళనంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలకు అందించిన విందు భోజనంలో మంత్రి పాల్గొని స్వయంగా వడ్డించారు. కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు ఆర్జేసీ కృష్ణ, రావూరి కరుణ, చావా మాధురి, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, చిరుమామిళ్ల లక్ష్మి, కొత్తపల్లి నీరజ, నాగుల్‌మీరా, చావా నారాయణరావు, కొనకంచి వరప్రసాద్, నర్రా ఎల్లయ్య, కుర్రా మాధవరావు, చిలుమూరు కోటి, హెచ్ ప్రసాద్, అ శ్రఫ్, ఏలూరి శ్రీనివాసరావు, మేకల సుగుణారావు, చిలకల వెంకటనర్సయ్య, కొల్లు పద్మ, జోగుపర్తి ప్రభాకర్, సరిపూడి సతీశ్, దొంగల తిరుపతిరావు, భుక్యా భాషా, వాంకుడోత్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.