ముదిగొండ, జూలై 20: నాటి కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షంగా వ్యవసాయ రంగం.. నేటి బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే మరోసారి పవర్ హాలిడేలు ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటల సాగుకు ఫుల్ డే పవర్ సప్లయి అవుతోందని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముదిగొండ రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదంటున్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై గ్రామాల్లో రైతులు చర్చించాలని అన్నారు. నాటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కరెంటు లేక అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు దేశమంతటికీ తెలిసిందేనని అన్నారు.
అర్ధరాత్రి కరెంటు ఇవ్వడం వల్ల ఎంతమంది అన్నదాతలు విద్యుత్‌షాక్‌తో చనిపోయారో ఆయా రైతు కుటుంబాలకు ఇంకా గుర్తే ఉన్నాయని అన్నారు. అందుకని ఉచిత్ విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ప్రజలే బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే, అన్నదాతలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ను మూడోసారీ ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ఆ తరువాత అదే వేదికపై పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, మందరపు లక్ష్మి, అమరయ్య, రమేశ్, మందరపు ఎర్ర వెంకన్న, తోట ధర్మారావు, మీగడ శ్రీనివాస్‌యాదవ్, కొమ్మూరి స్వాతి, మీగడ నీరజ, పంది శ్రీను, ఖాజా, భిక్షం, దారా రాము, కొమ్మూరి రమేశ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.