ఖమ్మం లీగల్, నవంబర్ 1 : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన హక్ హమారా భేతో హై క్యాంపెయిన్‌లో భాగంగా ఖమ్మం జిల్లాలోని జైళ్ళలో ఉన్న ఖైదీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా జైలులో క్యాంపెయిన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దాయిలతో మాట్లాడుతూ కేసు వివరాలు, వాయిదా తేదీలు, కేసులో జాప్యం, కుటుంబ సభ్యుల విషయాలు, ఆరోగ్య సమస్యలు, అప్పీలు సంబంధిత అంశాల్లో ఏవైనా ఉంటే ఈ క్యాంపెయిన్ కోసం నియమించిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ విద్యార్థులకు తెలపాలని సూచించారు.
ఈ విషయంలో 29అంశాలతో కూడిన ప్రశ్నావళిని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిందని వివరించారు. ఈ ప్రక్రియ 5నుంచి 7రోజులు కొనసాగుతుందని తదుపరి విస్త్రతమైన నివేదిక జాతీయ సంస్థకు సమర్పిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు మద్దినేని నాగేశ్వరరావు, జమ్మి వెంకటేశ్వర్లు, తేరాల గంగాధర్, శ్రీనివాస్, జి.కృష్ణ, న్యాయ విద్యార్థులు ప్రవళిక, నవ్య, రాధ పాల్గొన్నారు. వీరికి కావలసిన ఏర్పాట్లు జైలు పర్యవేక్షణ అధికారి ఎ.శ్రీధర్ సమకూర్చారు.