ములుగు, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండే పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో ‘మేడారం జాతర గైడ్ అఫీషియల్’ అనే యాప్ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్లే స్టోర్లో లాగిన్ అయి ‘మేడారం మహా జాతర గైడ్ అఫీషియల్’ అని ఇంగ్లిషులో టైప్ చేసిన వెంటనే సెల్ఫోన్లో యాప్ ప్రత్యక్షమవుతుంది. దీనిని డౌన్లోడ్ చేసుకున్న అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటంతో కూడిన యాప్ ప్రదర్శితమవుతోంది.
జాతరకు వచ్చే భక్తులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వారి పేరు సెల్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసిన అనంతరం యాప్లో మేడారానికి సంబంధించిన పూర్తి విశేషాలు ప్రదర్శింపబడతాయి. ఈ యాప్లో భక్తులకు అవసరమైన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా కరోనా టీకాల కేంద్రాలు, మరుగుదొడ్లు నిర్మించిన ప్రాంతాలు, జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలు, జాతరలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాలు, అవసరమయ్యే మెడికల్ క్యాంపులు, వాహనాలను పారింగ్ చేసే స్థలాలు, జాతరలోని ముఖ్య వివరాలతోపాటు జాతరలో నాలుగు రోజులపాటు రోజువారీ నిర్వహించే ముఖ్య పూజా కార్యక్రమాలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, మిస్సింగ్ కేంద్రాల వివరాలు ఉంటాయి.
వివిధ ప్రాంతాల నుంచి జాతరకు చేరుకునేందుకు ఏర్పాటైన రోడ్డు మార్గాలు, భక్తులు జాతర ప్రాంగణంలో విడిది చేసే ప్రాంతాలు, బంధుమిత్రులు ఉండే ప్రాంతాలు, ఆఫ్లైన్ నావిగేషన్ సౌకర్యం, మేడారం జాతర సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించే పోటీలు, భక్తులు చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలతోపాటు జాతరకు రోడ్డు మార్గాన వచ్చే క్రమంలో పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలను అధికారులు పొందుపరిచారు. అదేవిధంగా వివిధ శాఖల ద్వారా భక్తులకు కల్పించిన సౌకర్యాల వివరాలను కూడా ఈ యాప్లో రూపొందించారు. ముఖ్యంగా పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యేకంగా పొందుప రిచారు. వీటన్నింటితో పాటు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు జాతరకు సంబంధించిన ఫొటోలు వీడియోలను తమ తమ సెల్ ఫోన్ల ద్వారా అప్లోడ్ చేసే వెసులుబాటు కూడా ఈ యాప్లో అధికారులు కల్పించారు.